Begin typing your search above and press return to search.

ఐటీ కంపెనీలకు కీలక సూచన

నగరంలో పలు రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 July 2025 10:17 PM IST
ఐటీ కంపెనీలకు కీలక సూచన
X

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈ పరిస్థితిలో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరం నలుమూలలా పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు అప్రమత్తమయ్యారు.

వర్షం శుక్రవారం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఐటీ కంపెనీలకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అలాగే రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సదుపాయం కల్పించాలని ఆయన కోరారు. "అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు, రోడ్లపై ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, ఉద్యోగుల ప్రయాణ భద్రతను పరిగణనలోకి తీసుకుని, కంపెనీలు తమవంతు బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాం," అని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

నగరంలో పలు రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కంపెనీలు తమ ఉద్యోగులకు స్వచ్ఛందంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని కమిషనర్ సూచించారు. ఇప్పటికే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయడానికి అవకాశం కల్పించినట్లు సమాచారం. ఈ సూచనకు మిగిలిన కంపెనీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

నగర ప్రజలకు పోలీసులు సూచనలు

అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సూచించారు. ట్రాఫిక్ సమాచారాన్ని నిరంతరం గమనిస్తూ ప్రయాణించండి. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని.. ఎమర్జెన్సీ అవసరాల కోసం 100 లేదా 112 నంబర్లను సంప్రదించాలి.