స్కామ్ అంటే ఇదేరా బాబూ.. రూ.13 వేల కోట్లు కొల్లగొట్టారు
ఇది అల్లాటప్పా స్కామ్ కాదు.. సాక్షాత్తూ స్కామర్లకే మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ మోసం. టెక్నాలజీలో ఆరితేరిన కొందరు పక్కా ప్లాన్‌తో చేసిన 'వైట్ కాలర్' కుంభకోణం.
By: Tupaki Political Desk | 19 Feb 2026 11:27 PM ISTఇది అల్లాటప్పా స్కామ్ కాదు.. సాక్షాత్తూ స్కామర్లకే మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ మోసం. టెక్నాలజీలో ఆరితేరిన కొందరు పక్కా ప్లాన్‌తో చేసిన 'వైట్ కాలర్' కుంభకోణం. అక్షరాలా రూ.13,000 కోట్లు.. వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న అసలు రంగును హైదరాబాద్ జీఎస్టీ అధికారులు ఛేదించారు. సాంకేతికతను ఆయుధంగా చేసుకుని, వ్యవస్థల కళ్లుగప్పి కోట్లు కొల్లగొట్టిన ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు కథ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. గేమింగ్ ముసుగులో జరుగుతున్న ఈ భారీ దోపిడీని జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం బట్టబయలు చేసింది. ఒకరిని అరెస్టు చేసి, రూ.100 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు.
హైదరాబాద్ లో భారీ మోసాన్ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బయటపెట్టారు. రూ.13 వేల కోట్ల మోసానికి పాల్పడిన టెకీని అరెస్టు చేశారు. గేమింగ్ యాప్స్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేయడమే కాకుండా, ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా తరలించినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. పేమెంట్ గేట్ వే ఆధారంగా ఈ వ్యవహారంపై తీగలాగితే రూ.13 వేల కోట్ల మోసం వెలుగుచూసింది. జీఎస్టీ మోసాలపై నమోదైన కేసుల్లో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు.
జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) విభాగం అత్యాధునిక డేటా అనలిటిక్స్ , నిఘా వ్యవస్థల ద్వారా ఈ భారీ మోసాన్ని గుర్తించింది. షెల్ కంపెనీల పేరిట నకిలీ కేవైసీ పత్రాలను సృష్టించి, వాటిని గేమింగ్ వెబ్‌సైట్లతో అనుసంధానం చేయడాన్ని అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్ గేమింగ్ నుంచి వచ్చే భారీ నగదు ప్రవాహాన్ని నిర్వహించడానికి 'బాపా' వ్యవస్థలను పేమెంట్ గేట్‌వేలను అక్రమంగా వాడుకున్నట్లు గుర్తించారు.ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్లలో బెట్టింగ్ కట్టిన వారి నగదును దారి మళ్లించేందుకు వందలాది షెల్ కంపెనీల యూపీఐ ఐడీలను వాడినట్లు చెబుతున్నారు. అసాధారణ రీతిలో జరుగుతున్న ఈ లావాదేవీలను టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ల డేటా ద్వారా అధికారులు పట్టుకున్నారు.
అక్రమంగా సంపాదించిన సొమ్మును లబ్ధిదారులకు చేరవేసే క్రమంలో బ్యాంక్ ఖాతాల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలను విశ్లేషించి, కీలక సూత్రధారిని గుర్తించారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని సుమారు రూ.100 కోట్ల నిధులున్న ఖాతాలను ఫ్రీజ్ చేశారు. గేమింగ్ సిండికేట్ల ద్వారా లభించిన అక్రమ ఆదాయాన్ని పొందిన లబ్ధిదారులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మోసం ఇంకా ఎంతవరకు విస్తరించి ఉందోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా దొంగలు దొరక్కుండా పారిపోతారు, కానీ ఈ కేసులో టెక్నాలజీని అడ్డుపెట్టుకుని అసలు తాము ఎవరో కూడా తెలియకుండా వ్యవస్థను బురిడీ కొట్టించినట్లు చెబుతున్నారు. రూ.13 వేల కోట్ల స్కామ్ విచారణలో ఇంకా ఎన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయో చూడాల్సివుంది.
