Begin typing your search above and press return to search.

శ్మశానంలో సిలిండర్ల దందా.. పోయే కాలం కాక మరేంటి?

ఆశను అత్యాశ దాటేస్తే.. కోరికను కక్కుర్తి అధిగమిస్తే..దారుణాలు చోటుచేసుకుంటాయి.

By:  Garuda Media   |   31 March 2026 3:00 PM IST
శ్మశానంలో సిలిండర్ల దందా.. పోయే కాలం కాక మరేంటి?
X

ఆశను అత్యాశ దాటేస్తే.. కోరికను కక్కుర్తి అధిగమిస్తే..దారుణాలు చోటుచేసుకుంటాయి. డబ్బులు సంపాదించాలన్న యావ మంచిదే కానీ.. అదో రోగంగా మారితేనే ఇబ్బంది. ఏమైనా.. ఎవరెటుపోయినా తాము మాత్రం బాగుండాలన్న దుర్మార్గం నిలువెల్లా కమ్మేస్తే.. దరిద్రపుగొట్టుఐడియాలు వచ్చేస్తుంటాయి. అందుకు తగ్గట్లే.. ఊచలు లెక్కించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. తాజాగా అలానే చోటు చేసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్నయుద్దంతో గ్యాస్ సిలిండర్లు.. అందునా కమర్షియల్ సిలిండర్లకు ఏర్పడిన డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

యుద్ధానికి ముందు సిలిండర్ రూ.1800 కాస్తా యుద్ధం మొదలైన మూడు నాలుగు రోజులకే సిలిండర్ రూ.5-6 వేల వరకు బ్లాక్ లో అమ్ముకునే దుర్మార్గం పెరిగింది. అంతకంతకూ ఎక్కువైన డిమాండ్ తో.. కాసుల కక్కుర్తితో ఒక గ్యాస్ డీలర్ శ్మశానాన్ని వేదికగా చేసుకొని అక్కడ తన అక్రమ దందా సాగించాడు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల పుణ్యమా అని వీరి దందా బయటకు వచ్చింది. బంజారాహిల్స్ శ్మశాన వాటికలోని కొంత స్థలాన్ని అద్దెకు తీసుకొని అక్కడ సిలిండర్లను దాచి బ్లాక్ లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. ఈ ముఠా గురించి సమాచారం అందుకున్న పోలీసులు పది మంది నిందితులను అరెస్టు చేసి 414 కమర్షియల్ సిలిండర్లను సీజ్ చేసి.. పది వాహనాల్ని స్వాధీనం చేసుకుకున్నారు.

శంషాబాద్ కేంద్రంగా మహ్మద్ అమీర్ అనే వ్యక్తి మెట్రో గ్యాస్ పేరుతో ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. తన వద్ద ఉన్న కమర్షియల్ సిలిండర్లను బంజారాహిల్స్ లోని నాగార్జున ఎక్స్ రోడ్డు సమీపంలోని శ్మశాన వాటికలో సిలిండర్లను డంప్ చేస్తున్నాడు. అవసరమైన వారికి బ్లాక్ లో ఒక్కో సిలిండర్ రూ.6వేల చొప్పున అమ్ముతున్నాడు. శ్మశాన వాటికలో సిలిండర్లను దాచినందుకు నెలకు రూ.5 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నాడు. ఈ అక్రమ దందాకు సంబంధించి విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా భారీ ఎత్తున కమర్షియల్ గ్యాస్ బండల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సిలిండర్ల విలువ రూ.21.88 లక్షలు ఉంటాయని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ అక్రమ దందాకు సంబంధించి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి.. అధికారులు వివరాలు వెల్లడిస్తున్న వేళ..ప్రధాన నిందితుడు ఒక్కసారిగా లేచి తాను ఏ తప్పు చేయలేదని.. తనను అక్రమంగా కేసులో ఇరికించినట్లుగా కేకలు వేయటంతో పోలీసులు అవాక్కైన పరిస్థితి. వెంటనే..అతడ్ని తీసుకొని పక్కకు వెళ్లిపోయారు. అతడి తీరు హాట్ టాపిక్ గా మారింది.