Begin typing your search above and press return to search.

తల్లిదండ్రులకు భారం కాలేం.. డెలివరీ బాయ్స్‌గా బీటెక్ పట్టభద్రులు

హైదరాబాద్‌లో విస్మయానికి గురిచేసే దృశ్యం కనిపిస్తోంది. ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన యువకులు ఫుడ్ డెలివరీ, రైడ్ పూలింగ్ సర్వీసుల్లో పనిచేస్తూ కనిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 May 2025 5:00 AM IST
Degrees But No Jobs
X

హైదరాబాద్‌లో విస్మయానికి గురిచేసే దృశ్యం కనిపిస్తోంది. ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన యువకులు ఫుడ్ డెలివరీ, రైడ్ పూలింగ్ సర్వీసుల్లో పనిచేస్తూ కనిపిస్తున్నారు. వారిని ఎవరిని కదిలించినా తాము బీటెక్, ఎంబీఏ, డిగ్రీలు పూర్తి చేశామంటూ చెబుతున్నారు. కాలేజీల్లో సరైన నైపుణ్య శిక్షణ లేకపోవడంతో ఉద్యోగాలు రావడం లేదని, కాలేజీలు ప్లేస్‌మెంట్స్ కూడా ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు భారం కాకుడన్న ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నట్లు వారు చెబుతుంటే విన్నవాళ్ల గుండెలు తరుక్కుపోతున్నాయి.

హైదరాబాద్ వీధుల్లో తిరుగుతుంటే ఇలాంటి వారిని చాలా మంది గమనించే ఉంటారు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క ఎంతో మంది ఉన్నత విద్యావంతులు ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా, క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. వారి మాటల్లో నిరాశ, ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. లక్షలకు లక్షలు పోసి చదివినా తమకు అందుకు తగ్గ సరైన గుర్తింపు, ఉద్యోగం లభించడం లేదని వారు వాపోతున్నారు.

కాలేజీల్లో కేవలం సిలబస్‌ను పూర్తి చేయడం మీదనే దృష్టి పెడుతున్నారని, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్లేస్‌మెంట్స్ విషయంలో కూడా కాలేజీలు సరైన శ్రద్ధ చూపడం లేదని చెబుతున్నారు. దీంతో చదువు పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగం కోసం వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు బరువైన గుండెలతో చెబుతున్నారు.

తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమను చదివిస్తే.. వారికి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నామని ఆ యువకులు చెబుతున్నారు. తమకు మంచి ఉద్యోగం వస్తే ఈ కష్టాలన్నీ తీరిపోతాయని ఆశిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఈ నిరుద్యోగ సమస్య ప్రభుత్వాలు, విద్యాసంస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.