Begin typing your search above and press return to search.

ఛార్జీషీట్లలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్ ఈడీ!

హైదరాబాద్ జోన్ ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కార్యాలయం దేశంలోనే నెంబరు వన్ స్థానంలో నిలిచింది.

By:  Tupaki Desk   |   10 April 2025 10:01 AM IST
ఛార్జీషీట్లలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్ ఈడీ!
X

హైదరాబాద్ జోన్ ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కార్యాలయం దేశంలోనే నెంబరు వన్ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దేశంలోనే అత్యధికంగా ఛార్జీషీట్లను దాఖలు చేసిన ఆఫీసుగా నిలిచింది. గత ఏడాదిలో 49 ఛార్జీషీట్లను దాఖలు చేసింది. అంతకు ముందు ఏడాది అంటే 2023లో 40 ఛార్జీషీట్లను మాత్రమే దాఖలు చేయగా.. 2024లో ఆ సంఖ్య మరింత పెరిగింది.

2023తో పోలిస్తే 2024లో 20 శాతం మేర ఛార్జీషీట్లను నమోదు చేసింది. అంతేకాదు.. ఈడీ దర్యాప్తులో కీలకమైన ఆస్తుల జఫ్తులోనూ హైదరాబాద్ జోన్ ముందు ఉండటం గమనార్హం. 2023లో 19 కేసులకు సంబంధించి రూ.750 కోట్ల ఆస్తుల్ని జప్తు చేయగా.. 2024లో 43 కేసులకు రూ.916 కోట్ల ఆస్తుల్ని జఫ్తు చేశారు. ఛార్జీషీట్లు.. ఆస్తుల జఫ్తులో దూసుకెళుతున్న హైదరాబాద్ జోన్ ఈడీ ఆఫీసు.. కీలకమైన అరెస్టుల విషయంలో మాత్రం వెనుకపడటం విశేషం.

2023లో పది మందిని అరెస్టు చేయగా.. గత ఏడాది మాత్రం ఒక్కరిని మాత్రమే అరెస్టు చేసినట్లుగా రిపోర్టు వెల్లడించింది. అరెస్టుల కంటే నేరాన్ని నిరూపించే సాక్ష్యాధారాల్ని సేకరించి.. పక్కాగా ఛార్జీషీట్లను దాఖలు చేస్తున్నట్లుగా ఈడీ అధికారులు తమ చర్యల్ని సమర్థించుకుంటున్నారు. ఇక కేసుల నమోదు విషయానికి వస్తే.. 2023లో 59 కేసుల్ని నమోదు చేస్తే.. 2024లో మాత్రం కాస్త తక్కువగా కేసులు నమోదు చేయటం గమనార్హం. 2024లో 58 కేసుల్ని మాత్రమే ఈడీ హైదరాబాద్ జోన్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.