Begin typing your search above and press return to search.

ఎబోలా అనుమానిత కేసు? హైదరాబాద్‌లో అధికారుల అప్రమత్తం!

భాగ్యనగరంలో ఒక ఎబోలా అనుమానిత కేసు కలకలం రేపుతోంది. సుడాన్ దేశం నుండి హైదరాబాద్ వచ్చిన ఒక వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.

By:  Madhu Reddy   |   4 Jun 2026 3:41 PM IST
ఎబోలా అనుమానిత కేసు? హైదరాబాద్‌లో అధికారుల అప్రమత్తం!
X

భాగ్యనగరంలో ఒక ఎబోలా అనుమానిత కేసు కలకలం రేపుతోంది. సుడాన్ దేశం నుండి హైదరాబాద్ వచ్చిన ఒక వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని ప్రత్యేక మెడికల్ అబ్జర్వేషన్‌కు తరలించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇది కేవలం అనుమానం మాత్రమేనని, ఎబోలా కేసుగా ఇంకా కన్ఫర్మ్ కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

సుడాన్ వ్యక్తిలో లక్షణాలు:

ఇటీవలే సుడాన్ దేశం నుండి ఒక వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చాడు. అయితే అతనికి ఎబోలా వైరస్ సోకినప్పుడు వచ్చే కొన్ని ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో స్థానిక హెల్త్ అఫీషియల్స్ అలర్ట్ అయ్యారు. ఇక ఆలస్యం చేయకుండా అతడిని ఐసోలేషన్‌కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ ఎక్కువగా ఉండటం తో , అధికారులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని ముందస్తు చర్యలు చేపట్టారు.

ఎయిర్‌పోర్టులో టైట్ స్క్రీనింగ్:

ఈ ఎబోలా ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విదేశాల నుండి, ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం నిఘాను గట్టి జేసింది. ఎయిర్‌పోర్టులోనే ప్రత్యేక స్క్రీనింగ్, హెల్త్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక ఎవరికైనా కొద్దిగా అనుమానాస్పద లక్షణాలు ఉన్నా.. వెంటనే వారిని నిశితంగా పరిశీలించేందుకు హెల్త్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి.

భయం వద్దు:

ఈ వార్త తెలియగానే చాలా మంది కంగారు పడుతున్నారు కానీ, అధికారులు ఇది కేవలం అనుమానం మాత్రమేనని చెబుతున్నారు. ఇక హైదరాబాద్‌లో గానీ, తెలంగాణలో గానీ ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా అధికారికంగా నమోదు కాలేదు. ల్యాబ్ రిపోర్టులు వస్తే తప్ప అసలు విషయం తెలియదని, కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.

కానీ.. జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి:

ఇక అందరు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. విదేశాల నుండి వచ్చిన వారితో మాట్లాడేటప్పుడు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఏవైనా తీవ్రంగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మన జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష అని హెల్త్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది.

ప్రస్తుతానికి హైదరాబాద్ హెల్త్ టీమ్స్ పరిస్థితిని పూర్తిగా తమ కంట్రోల్‌లోనే ఉంచుకున్నాయి. ఎబోలా అనుమానిత వ్యక్తికి చికిత్స అందిస్తూనే, వైరస్ వేరే వాళ్లకు రాకుండా అన్ని నియమాలు ఫాలో అవుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యల వల్ల ఎలాంటి ప్రమాదం పొంచి లేదని అనుకోవచ్చు. కాబట్టి ఆందోళన పక్కనబెట్టి, కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది అని నిపుణుల అభిప్రాయం.