మత్తు వదల్లేని ప్రముఖుల పిల్లలు.. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఒక ఉదాహరణ మాత్రమే..
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వాడకం ఆందోళన రేకెత్తిస్తోంది. ఏపీలోని జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి తాజాగా అరెస్టు కావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.
By: Tupaki Desk | 4 Jan 2026 12:47 PM ISTహైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి వాడకం ఆందోళన రేకెత్తిస్తోంది. ఏపీలోని జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి తాజాగా అరెస్టు కావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల పిల్లలే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు ఎక్కువగా బానిసలు అవుతున్నట్లు తాజా ఉదంతం మరోసారి నిరూపించిందని అంటున్నారు. గతంలో కూడా హైదరాబాదులో పలువురు సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకుల పిల్లలే డ్రగ్స్, గంజాయి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. విచారణల్లో వారు ‘క్లీన్ చిట్’ తెచ్చుకుంటున్నా, వ్యక్తిగతంగా మత్తు ఉచ్చు నుంచి బయటపడటం లేదన్న విషయంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రగ్స్, గంజాయి వాడకంపై యుద్ధం ప్రకటించారు. ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గతంలో ఉన్నతెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో స్థానంలో ఎలైట్ యాక్టన్ గ్రూప్ (ఈగల్) పేరిట ప్రత్యేక శక్తివంతమైన విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది అత్యాధునిక సాంకేతికతతో డ్రగ్ నెట్‌వర్క్‌లను ఛేదిస్తోంది. ఈ క్రమంలోనే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పట్టుబడ్డారు. నానక్‌రామ్‌గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికారు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించింది.
తాజా ఘటన నగరంలోని ప్రముఖులు, సెలబ్రెటీల కుటుంబ సభ్యుల అలవాట్లపై మరోసారి చర్చకు కారణమవుతోంది. హై-ఎండ్ పార్టీలు, పబ్ కల్చర్‌లో డ్రగ్స్ వాడటం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. మరికొందరు ఇదో ఫ్యాషన్ గా భావిస్తూ మాదకద్రవ్యాలకు బానిస అవుతున్నారు. ఇలా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని కుటుంబ సభ్యులు ముందుగానే గుర్తిస్తున్నా, పరువు సమస్యతో బయటపెట్టలేకపోతున్నారు. ఇదో మానసిక ఆరోగ్య సమస్యగా గుర్తించలేకపోతున్నారు. మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడటం అనేది వైద్యపరమైన సమస్యే కాకుండా, సామాజిక, వ్యక్తిగత సవాలుగానే గుర్తిస్తేసే దురలవాటు నుంచి బయటపడతారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ విక్రయాలు, వాడకాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నా, రోజూ సగటున 11 కేసులు నమోదు అవుతుండటం ఆందోళన పెంచుతోంది. 2025లో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డ్రగ్స్ నిరోధక చర్యలు గణనీయంగా పెరిగాయి. 2024లో సుమారు 1,850 కేసులు నమోదు కాగా, 2025 నాటికి అది 4,142కు పెరిగింది. ప్రభుత్వ చర్యల వల్ల గంజాయి, డ్రగ్స్ కేసుల నమోదు, అరెస్టులు దాదాపు 127% పెరుగుదల నమోదైంది. అంటే సగటున రోజుకు 11 కేసులు నమోదవుతున్నాయి. అదేసమయంలో ప్రతిరోజూ సగటున 14 మంది డ్రగ్స్ సంబంధిత కేసుల్లో అరెస్టవుతున్నారు. 2025లో మొత్తం 7,066 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 6,857 కిలోలు గంజాయి కాగా, మిగిలినవి MDMA, కొకైన్ వంటి ఖరీదైన డ్రగ్స్ ఉన్నాయి.
గంజాయి, డ్రగ్స్ కేసులు భారీగా నమోదు అవుతున్నా, ఆ కేసుల్లో శిక్షలు విధించడం తక్కువగా ఉంటోందని అంటున్నారు. గత ఏడాది నాలుగు వేలకు పైగా కేసులు నమోదు చేస్తే 22 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. ఒక విధంగా గతంతో పోలిస్తే శిక్షల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంకా కోర్టు విచారణలు, శిక్షల విధింపులో జోరు పెరగాల్సివుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
