Begin typing your search above and press return to search.

ఇంటినే డ్రగ్ ఫ్యాక్టరీగా మార్చిన డాక్టర్.. చూసి పోలీసుల షాక్

నిషేధ, ఎక్సైజ్‌ శాఖ , నార్కోటిక్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ (NTF) అధికారులు ముషీరాబాద్‌లో జాన్ పాల్‌ అనే డాక్టర్‌ నివాసంపై దాడులు నిర్వహించారు.

By:  Tupaki Desk   |   5 Nov 2025 1:31 PM IST
ఇంటినే డ్రగ్ ఫ్యాక్టరీగా మార్చిన డాక్టర్.. చూసి పోలీసుల షాక్
X

భాగ్యనగరంలో మరోసారి మాదకద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ డాక్టర్‌ తన ఇంటినే డ్రగ్స్‌ నిల్వ , విక్రయ కేంద్రంగా మార్చడం చూసి అధికారులు అవాక్కయ్యారు.

నిషేధ, ఎక్సైజ్‌ శాఖ , నార్కోటిక్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ (NTF) అధికారులు ముషీరాబాద్‌లో జాన్ పాల్‌ అనే డాక్టర్‌ నివాసంపై దాడులు నిర్వహించారు. స్పష్టమైన సమాచారంతో జరిపిన ఈ దాడుల్లో రూ.3 లక్షల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. డాక్టర్ జాన్ పాల్ అద్దె ఇంట్లో డ్రగ్స్‌ నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతను ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల నుండి పేడ్లర్ల ద్వారా డ్రగ్స్‌ తెప్పించేవాడని ఆరోపణలు ఉన్నాయి.

దాడి సమయంలో OG కుష్‌, ఎంఢీఎంఏ, కోకైన్‌, హ్యాష్‌ ఆయిల్‌‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో డాక్టర్ జాన్ పాల్‌తో కలిసి డ్రగ్స్‌ రాకెట్‌ను నడిపిస్తున్న మరో ముగ్గురు నిందితులు ప్రమోద్‌, సందీప్‌, శరత్‌లను కూడా పోలీసులు గుర్తించారు. వీరంతా అతని ఇంటినే నిల్వ కేంద్రంగా ఉపయోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

సైబరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై భారీ దాడులు, నైజీరియా వాసుల అరెస్ట్

నగరంలో డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతూ సైబరాబాద్‌ పోలీసు అధికారులు కూడా భారీ దాడులు నిర్వహించారు. గచ్చిబౌలి పోలీసులు, మాధాపూర్‌ జోన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ (SOT) సంయుక్తంగా టి.ఎన్.జీఓస్‌ కాలనీలో ఉన్న ఎస్‌.ఎమ్‌. లగ్జరీ గెస్ట్‌ రూమ్‌ & కో-లివింగ్‌ పీజీ హోస్టల్‌లో దాడి చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

వారి విచారణలో లభించిన సమాచారం ఆధారంగా మాధాపూర్‌లోని హోటల్‌ నైట్‌ ఐ వద్ద మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణలో డ్రగ్స్‌ వినియోగదారులను కూడా గుర్తించి అరెస్ట్‌ చేశారు.

దాడుల సమయంలో 32.14 గ్రాముల ఎంఢీఎంఏ, 4.67 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏడుగురు నిందితులు, అందులో ఇద్దరు నైజీరియా దేశస్తులు, పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిలో సరఫరాదారులు, డిస్ట్రిబ్యూటర్లు, వినియోగదారులు ఉన్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ డ్రగ్స్‌ రాకెట్‌ నెట్‌వర్క్‌ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు విస్తరించి ఉంది. యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వీరు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. డ్రగ్స్‌ మాఫియాపై తమ దాడులు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.