Begin typing your search above and press return to search.

పగటి పూటా డ్రంక్ & డ్రైవ్ టెస్టులు.. ఎప్పటి నుంచంటే..?

అవును... ఇకపై డ్రంక్ & డ్రైవ్ టెస్టుల విషయంలో పగలూ, రాత్రి అనే తేడాలేవీ లేవని.. ఆకస్మిక డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిత్యం ఉంటాయని సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   17 July 2025 11:11 AM IST
పగటి పూటా డ్రంక్ & డ్రైవ్ టెస్టులు.. ఎప్పటి నుంచంటే..?
X

మందుబాబులను అత్యంత టెన్షన్ పెట్టే విషయం "డ్రంక్ & డ్రైవ్ టెస్ట్" అనే సంగతి తెలిసిందే. బార్ లోనో, పబ్బులోనో తాగినంత సమయం బాగానే ఉంటుంది కానీ.. ఒక్కసారి పార్కింగ్ లోకి వెళ్లి బైక్ / కారు బయటకు తీస్తుంటే అప్పుడు మొదలవుతుంటుంది టెన్షన్! అయితే.. ఇకపై ఈ తరహా టెన్షన్ రాత్రి పూట మాత్రమే కాదు.. పగలు కూడా ఉంటుందని చెబుతున్నారు హైదరాబాద్ పోలీసులు!

అవును... ఇకపై డ్రంక్ & డ్రైవ్ టెస్టుల విషయంలో పగలూ, రాత్రి అనే తేడాలేవీ లేవని.. ఆకస్మిక డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిత్యం ఉంటాయని సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మింట్‌ కాంపౌండ్‌ సర్కిల్ లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లడిన జోయల్ డేవిస్... సంచలన విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా... పాఠశాలకు పిల్లలను తీసుకెళ్లే బస్సు, వ్యాను, ఆటోల డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారే షాకింగ్ విషయం వెల్లడించారు. నెల రోజుల్లో ఇలాటివారిని 35 మందిని గుర్తించామని, ఇందులో ఓ డ్రైవర్‌ కు ఏకంగా 400 రీడింగ్‌ వచ్చిందని తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా... పాఠశాలల్లో బస్సు డ్రైవర్లకు ఉదయం, సాయంత్రం తనిఖీలు చేసి పంపాలని యాజమాన్యాలకు లేఖలు రాశామని తెలిపారు! పిల్లలను తీసుకెళ్లే డ్రైవర్లు మద్యం తాగి పట్టుబడటంపై విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లామని.. దీనిపై సమీక్ష నిర్వహించి పగటి వేళల్లోనూ ఆకస్మిక తనిఖీలు చేసేలా నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

ఇదే సమయంలో... బ్రీత్ అనలైజర్ పరీక్షలో 30 ఎంజీ ఆల్కహాల్ ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు! డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ఎట్టిపరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ చొరవ తీసుకున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

కాగా... ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 30 వేల డ్రంక్ & డ్రైవ్‌ కేసులు పెట్టగా.. అందులో 1,300 మందికి ఒక రోజు నుంచి ఇరవై రోజుల వరకు జైలు శిక్ష పడిందని చెబుతున్నారు. ఇందులోని 4500 మైనర్‌ కేసుల్లో 2800 రిజిస్ట్రేషన్ల రద్దు కోసం రవాణా శాఖకు పంపగా ఇప్పటి వరకు 853 రద్దయ్యాయని తెలిపారు.