Begin typing your search above and press return to search.

కో లివింగ్ కల్చర్ హైదరాబాద్ లో బంద్ చేయాలి

వీహెచ్ మాట్లాడుతూ గతంలో తెలంగాణలో ఫ్యాక్షన్ హత్యలు ఎక్కువగా జరుగుతాయని ప్రజలు భయపడేవారు.

By:  Tupaki Desk   |   25 Jun 2025 6:59 PM IST
కో లివింగ్ కల్చర్ హైదరాబాద్ లో బంద్ చేయాలి
X

హైదరాబాద్‌ నగరంలో కొత్తగా పెరిగిపోతున్న కో-లివింగ్ కల్చర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడ, మగ కలిసి ఒకే రూంలో నివసించే పద్ధతిని తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రేమ హత్యలకు కోలివింగ్ కారణమా?

వీహెచ్ మాట్లాడుతూ గతంలో తెలంగాణలో ఫ్యాక్షన్ హత్యలు ఎక్కువగా జరుగుతాయని ప్రజలు భయపడేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కోలివింగ్ సాంప్రదాయం వల్ల ప్రేమ హత్యలు, కుటుంబ హింస కేసులు పెరిగిపోతున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగాలు చేసే యువత ఒకే హాస్టల్ లేదా రూమ్‌లో నివసించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది మానసిక, సామాజిక సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు.

-హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ కావాలంటే...

“హైదరాబాద్‌ను దేశంలో నెంబర్ వన్ సిటీగా నిలబెట్టాలంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను వెంటనే కట్టడి చేయాలి. కోలివింగ్ హాస్టల్స్‌ పేరుతో జరుగుతున్న అనైతిక వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలి,” అని ఆయన స్పష్టం చేశారు.

- సోషల్ మీడియాకు విజ్ఞప్తి

ఇటీవల జరగుతున్న భయానక సంఘటనల గురించి మాట్లాడుతూ, "అక్కను చంపుడు, తల్లిని చంపుడు, భార్యను చంపుడు, భర్తను చంపుడు" వంటి వార్తలు తరచూ వస్తున్నాయని, ఇవి సమాజాన్ని కలవరపెడుతున్నాయని వీహెచ్ తెలిపారు. “ఇలాంటి హింసాత్మక వార్తలు కొంచెం తక్కువగా ప్రచురించండి,” అంటూ సోషల్ మీడియా వేదికలకూ విజ్ఞప్తి చేశారు.

-సమాజం కోసం ప్రభుత్వ జోక్యం అవసరం

సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న నగరమైన హైదరాబాద్‌లో నైతిక విలువలు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని వీహెచ్ పేర్కొన్నారు. కోలివింగ్ ద్వారా స్వేచ్ఛ పేరుతో జరిగే అశాంతికి బ్రేక్ వేయాలని కోరారు. అభివృద్ధితో పాటు సంస్కారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, నగరం బుద్ధిగా, భద్రంగా ఉండాలంటే ఇది అత్యవసరమని అన్నారు.