వీడో సిత్రమైన దొంగ.. యాలకులు మాత్రమే చోరీ చేస్తాడు
వీడో సిత్రమైన దొంగ. మిగిలిన దొంగలకు వీడికి ఓ పెద్ద తేడా ఉంది. దొంగలు దొంగతనాన్ని షురూ చేసిన తర్వాత.. తమ చోరకళను అంతకంతకూ మెరుగుపర్చుకుంటూ పెద్ద దొంగతనాల మీద ఫోకస్ చేస్తారు.
By: Tupaki Desk | 5 July 2025 12:00 PM ISTవీడో సిత్రమైన దొంగ. మిగిలిన దొంగలకు వీడికి ఓ పెద్ద తేడా ఉంది. దొంగలు దొంగతనాన్ని షురూ చేసిన తర్వాత.. తమ చోరకళను అంతకంతకూ మెరుగుపర్చుకుంటూ పెద్ద దొంగతనాల మీద ఫోకస్ చేస్తారు. కానీ.. వీడు అందుకు భిన్నం. అలవాటైన పద్దతిలో చిన్న చోరీ.. అది కూడా ఒకే షాపులో ఒకే వస్తువును దొంగతనం చేస్తుంటాడు.తాజాగా అతగాడు పోలీసులకు దొరికిపోయాడు. చిన్న దొంగతనమే అయినా చోరీ చోరీనే. అతగాడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇంతకూ ఇతడేం చేశాడంటే..
దిలీప్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లో కేటరింగ్ పనులు చేస్తుంటాడు. కేటరింగ్ పనుల్లో వినియోగించే మసాలా దినుసుల్లో యాలకులు ఖరీదైనవి. అందుకే.. డిమార్టుకు వెళ్లి.. వంద గ్రాముల యాలుకల పాకెట్లను దొంగతనం చేస్తూ ఉంటాడు. ఇతగాడి హస్తలాఘవానికి.. సనత్ నగర్ లోని డిమార్టులో 100 గ్రాముల యాలకుల పాకెట్లు అదే పనిగా తగ్గుతున్నట్లుగా గుర్తించారు. పెట్టిన స్టాక్ అయిపోవటం.. సేల్ రిపోర్టులో యాలకులు అమ్మినట్లుగా లేకపోవటంతో అనుమానించారు.
దీంతో.. సీసీ ఫుటేజ్ ను తీసి జాగ్రత్తగా గమనించగా.. దిలీప్ కుమార్ హస్తలాఘవాన్ని సనత్ నగర్ డిమార్టు సిబ్బంది గుర్తించారు.ఎప్పటిలానే దర్జాగా డిమార్టుకు వచ్చిన దిలీప్ కుమార్ 100 గ్రాముల యాలకులు పాకెట్లు రెండు తీసుకొని.. అక్కడే ఉన్న వాష్ రూంకు వెళ్లి.. లోదుస్తుల్లో వాటిని దాచి ఏమీ తెలీనట్లుగా బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇతగాడి కోసమే ఎదురుచూస్తున్న సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు.
తనిఖీలో భాగంగా యాలకుల దొంగతనాన్ని గుర్తించారు. తాను గతంలోనూ యాలకుల్ని చోరీ చచేసినట్లుగా ఒప్పుకున్నాడు. యాలకులు ఖరీదు ఎక్కువని.. అందుకే.. తాను చోరీ చేస్తున్నట్లుడా చెప్పాడు. ఇప్పటివరకు 22 పాకెట్ల వరకు తాను దొంగలించినట్లుగా ఒప్పుకున్నాడు.దీంతో..అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు పంపారు. చిన్నదైనా.. పెద్దదైనా దొంగతనం దొంగతనమే. అలాంటి పాడు పనులు చేస్తే అందుకు మూల్యం చెల్లించక తప్పదు.