సైబర్ నేరగాళ్ల ట్రాప్ నుంచి హైదరాబాద్ వ్యాపారి గ్రేట్ ఎస్కేప్!
సరూర్ నగర్ గ్రీన్ పార్కు కాలనీకి చెందిన వ్యాపారి శ్రీనివాసరెడ్డికి ఈ నెల 19న వాట్సాప్ లో ఒక కాల్ వచ్చింది.
By: Tupaki Desk | 26 Jun 2025 10:27 AM ISTఎప్పటికప్పుడు సరికొత్త స్క్రిప్టుతో ఆశ పెట్టటం లేదంటే భయపెట్టటంతో మోసం చేసే సైబర్ నేరగాళ్ల విసిరిన ఉచ్చు నుంచి తెలివిగా తప్పించుకున్నారు హైదరాబాద్ కు చెందిన వ్యాపారి. ఆయనకు ఎదురైన అనుభవం మిగిలిన వారందరికి ఒక చక్కటి పాఠంగా చెప్పాలి. తీవ్రమైన ఒత్తిడి వేలలోనూ లాజిక్ మిస్ కాకుండా వ్యవహరించిన సదరు వ్యాపారి తెలివిని అభినందించాల్సిందే. అసలేం జరిగిందంటే..
సరూర్ నగర్ గ్రీన్ పార్కు కాలనీకి చెందిన వ్యాపారి శ్రీనివాసరెడ్డికి ఈ నెల 19న వాట్సాప్ లో ఒక కాల్ వచ్చింది. స్క్రీన్ మీద సీబీఐ విక్రమ్ అనే పరు కన్పించటంతో కొంత ఆందోళనకు గురయ్యారు. అంతేకాదు సదరు వాట్సాప్ కాల్ డీపీగా తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఫోటో ఉండటంతో టెన్షన్ కు గురయ్యారు. ఫోన్ చేసిన వారు తమను తాము కెనడా సైబర్ క్రైం విభాగం అధికారులుగా పేర్కొంటూ 7 నిమిషాల 49 సెకన్లు మాట్లాడారు.
మీ అమ్మాయి కెనడాలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యింది. వెంటనే మేం చెప్పిన ఖాతాకు రూ.50 వేలు పంపితే ఆమెను విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఒకవేళ డబ్బులు పంపని పక్షంలో ఆమెపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో సదరు వ్యాపారి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.తమ కుమార్తెను చూపాలని కోరారు. అందుకు సైబర్ నేరగాళ్లు నో చెప్పారు. అదే సమయంలో పక్క నుంచి మరికొందరి అరుపులు.. కేకలు వినిపించాయి.
డబ్బులు ఇస్తే తప్పించి మాట్లాడించమని చెప్పటంతో.. ఫోన్ కాల్ కట్ చేసిన సదరు వ్యాపారి వెంటనే కెనడాలో ఉన్న తన కుమార్తెకు ఫోన్ చేయగా.. తనకు ఏమీ కాలేదని.. తాను ఇంట్లోనే ఉన్నట్లుగా చెప్పటంతో తనను సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారన్న విసయాన్ని అర్థం చేసుకున్నారు. ఆ వెంటనే తనకు వచ్చిన వాట్సాప్ నెంబరును పరిశీలించగా అది పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే రీతిలో మిగిలిన వారు ఎవరైనా సైబర్ నేరస్తులు విసిరే ఉచ్చులో పడకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కష్టపడి సంపాదించిన డబ్బులు చేజారవు.
