Begin typing your search above and press return to search.

ఇలాంటి ఫోన్ కాల్ వస్తే బెదిరిపోకుండా పోలీసుల వద్దకు వెళ్లండి

హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారికి వారం క్రితం ఒక ఫోన్ వచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులుగా తమను తాము పరిచయం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 4:54 AM GMT
ఇలాంటి ఫోన్ కాల్ వస్తే బెదిరిపోకుండా పోలీసుల వద్దకు వెళ్లండి
X

సైబర్ నేరగాళ్లు అంతకంతకూ రెచ్చిపోతున్నారు. తప్పుడు మాటలు చెప్పి భయానికి గురి చేసి లక్షలు దండుకుంటున్నారు. తాము ఎలాంటి తప్పు చేయకున్నా.. ఎందుకు వచ్చిందన్న ఆందోళనతో వారు చేసే తప్పులకు శిక్షగా లక్షలాది రూపాయిల్ని పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారి ఇదే రీతిలో రూ.98 లక్షలు పోగొట్టుకున్న వైనం సంచలనంగా మారింది. తాము కొల్లగొట్టిన భారీ మొత్తాన్ని క్షణాల వ్యవధిలో దేశ వ్యాప్తంగా ఉన్న 11 బ్యాంకు ఖాతాలకు మళ్లించిన వైనం చూస్తే.. సైబర్ నేరగాళ్ల నెట్ వర్కు ఎంత భారీగా ఉంటుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇంతకూ అంత భారీ మొత్తాన్ని ఎలా పోగొట్టుకున్నారన్న విషయంలోకి వెళితే.. సైబర్ నేరగాళ్ల మాస్టర్ మైండ్ ఏమిటన్నది అర్థమవుతుంది.

హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారికి వారం క్రితం ఒక ఫోన్ వచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులుగా తమను తాము పరిచయం చేసుకున్నారు. ఫెడ్ ఎక్స్ కొరియర్ ద్వారా ఒక పార్శిల్ వచ్చిందని.. అందులో మత్తుమందులు ఉన్నట్లుగా చెబుతూ.. కేసు పెడితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో.. సదరు వ్యాపారి బెదిరిపోయాడు. దీంతో.. తనను రక్షించాలని సదరు వ్యాపారస్తుడు వేడుకున్నాడు.

దీంతో.. తాము చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.కోటి మొత్తాన్ని జమ చేస్తే కేసు పెట్టకుండా చూస్తామని నమ్మించారు. దీంతో.. భయంతో ఉన్న ఆ వ్యాపారి.. రూ.98 లక్షల భారీ మొత్తాన్నిఆన్ లైన్ ట్రాన్సఫర్ చేశాడు. ఆ త్వాత అనుమానం వచ్చిన ఆయన వెంటనే 1930కు ఫోన్ చేశారు. ఈ సమాచారం అందుకున్నతెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగింది. మొదట బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకుకు ఫోన్ చేయగా.. ఆయన ట్రాన్సఫర్ చేసిన బ్యాంకు జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా పంజాబ్ నేషనల్ బ్యాంకు లో జుజు అనే వ్యక్తి ఖాతాలో జమ అయినట్లుగా గుర్తించారు.

దీంతో.. సదరు బ్యాంక్ కు ఫోన్ చేయగా.. తమ బ్యాంక్ నుంచి నిధులు ఐదు వేర్వేరు రాష్ట్రాల్లోని బ్యాంకులకు బదిలీ చేసినట్లుగా గుర్తించారు. దీంతో.. ఆ ఐదు బ్యాంకులకు ఫోన్ చేయగా.. అక్కడి నుంచి మరో ఆరు బ్యాంకులకు మళ్లించారని తెలుసుకొని.. వెంటనే ఆ బ్యాంకులకు ఫోన్లు చేశారు. జరిగిన మోసాన్ని వారికి తెలియజేశారు. కేసు నమోదు చేస్తున్నామని.. డబ్బులు ఎవరూ డ్రా చేయకుండా నిలిపివేయాలని కోరారు.

కానీ.. అప్పటికే సైబర్ నేరగాళ్లు రూ.15 లక్షలు డ్రా చేయటం గమనార్హం. అయితే.. మిగిలిన రూ.83 లక్షలు డ్రా చేయకుండా అడ్డుకున్నారు. ఒకటే కేసులో ఇంతటి భారీ మొత్తాన్ని రికవరీ చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. మెరుపు వేగంతో సైబర్ పోలీసులు స్పందించటంతో ఈ భారీ మొత్తాన్ని సేవ్ చేయగలిగారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా.. ఈ మొత్తం చేజారిపోయేదని చెబుతున్నారు. సో.. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చి.. ఏమైనా బెదిరింపులకు దిగితే.. బెదిరిపోకుండా నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వటం.. వారి సూచనలతో .. సదరు నెంబరును బ్లాక్ చేయటం మంచిది.