నీరు, గాలి అనే తేడా లేదు.. విద్యార్థులు తయారు చేశారు.. నేనెవరు..?
ఈ సందర్భంగా... వేరియబుల్ పిచ్ ప్రొపెల్లర్ సిస్టమ్ దీని ప్రత్యేకత అని చెప్పిన విద్యార్థులు... సాధారణంగా ఉండే ప్రొపెల్లర్స్ కు భిన్నంగా ఇందులో మూడు అడ్జస్టబుల్ బ్లేడ్ లు అమర్చినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 24 July 2025 5:00 AM ISTఅటు వ్యవసాయం నుంచి, ఇటు రెస్క్యూ వరకూ, అటు రివ్యూ నుంచి యుద్ధం వరకూ అన్నింటిలోనూ డ్రోన్ల హవా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు డ్రోన్ల సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా వీటి వినియోగం అన్ని రంగాల్లోనూ పెరుగుతోంది. ఈ సమయంలో అటు నీటిలోనూ, ఇటు గాలిలోనూ పనిచేసే రోబోను అభివృద్ధి చేశారు.
అవును... ప్రపంచ వ్యాప్తంగా పలు రంగాల్లో డ్రొన్ల వినియోగం రోజు రోజుకీ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పౌర, రక్షణ రంగ అవసరాలను తీరేలా సరికొత్త డిజైన్లతో, కొత్త కొత్త సాంకేతికతతో సరికొత్త డ్రోన్లను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో గాల్లో ఎగిరేలా, నీటి లోపల ఈదేలా హైబ్రీడ్ డ్రోన్ ను అభివృద్ధి చేశారు.
వివరాళ్లోకి వెళ్తే... డెన్మార్క్ లోని ఆల్ బార్గ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు బ్యాచిలర్ థీసిస్ కోసం ఇటీవల ఈ హైబ్రీడ్ డ్రోన్ ను తయారు చేశారు. ఈ నేపథ్యంలో దానికి సక్సెస్ ఫుల్ గా పరీక్షించిన వీడియోను పంచుకున్నారు. ఈ సందర్భంగా స్పందిస్తూ... డ్రోన్ నీటి నుండి గాలిలోకి ఎంత సజావుగా మారుతుందో చూసి తామే ఆశ్చర్యపోయామని విద్యార్థులు అన్నారు.
ఈ సందర్భంగా... వేరియబుల్ పిచ్ ప్రొపెల్లర్ సిస్టమ్ దీని ప్రత్యేకత అని చెప్పిన విద్యార్థులు... సాధారణంగా ఉండే ప్రొపెల్లర్స్ కు భిన్నంగా ఇందులో మూడు అడ్జస్టబుల్ బ్లేడ్ లు అమర్చినట్లు తెలిపారు. ఇవి పరిస్థితికి తగ్గట్టుగా తమ డ్రోన్ యాంగిల్స్ ను మార్చుకునేందుకు ఉపయోగపడుతున్నాయని వివరించారు.
అంటే.. గాల్లో ఉన్నప్పుడు ప్రొపెల్లర్ బ్లేడ్ స్టీపర్ పిచ్ లోకి మారినప్పుడు థ్రస్ట్ ఏర్పడి డ్రోన్ గాల్లోకి బలంగా ఎగురుతుంది. ఒకవేళ డ్రోన్ల నీటి లోపలికి వెళ్తే... ఈ బ్లేడ్లు యాంగిల్ ను తగ్గించుకుంటాయి. అప్పుడు డ్రోన్ నీళ్లలో ఈదుకుంటూ వెళ్లగలుగుతుంది. టెస్టింగ్ సమయంలో ఈ డ్రోన్ పలుమార్లు నీళ్లలో ఈది.. అక్కడి నుంచి గాల్లోకి విజయవంతంగా ఎగిరింది.
ఈ సందర్భంగా ఆల్ బార్గ్ విశ్వవిద్యాలయంలో ఆఫ్ షోర్ డ్రోన్స్, రోబోట్స్ పరిశోధన బృందానికి నాయకత్వం వహిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ పీటర్ డర్డెవిక్ స్పందిస్తూ... విద్యార్థులు తమ విశ్వవిద్యాలయంలో రెండు సెమిస్టర్లలో ఈ డ్రోన్ ను రూపొందించారని.. సక్సెస్ ఫుల్ గా పరీక్షించారని తెలిపారు.
ఆ బృందం డ్రోన్ నిర్మాణానికి అవసరమైన భాగాలను పొందడానికి 3డీ ప్రింటర్, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషీన్ ను ఉపయోగించిందని వెల్లడించారు. ఇది సముద్రంలో నిఘాతో పాటు, ప్రకృతి విపత్తుల సమయంలో రెస్క్యూ బృందాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.
