Begin typing your search above and press return to search.

హుస్నాబాద్ లో తిరుగుబాటు మొదలైందా ?

సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ మాజీ ఎంఎల్ఏ ప్రవీణ్ రెడ్డి తన మద్దతుదారులతో సమావేశం పెట్టుకున్నారు. మధ్యాహ్నం పైన భేటీ వుండబోతోందని సమాచారం.

By:  Tupaki Desk   |   28 Oct 2023 12:37 PM GMT
హుస్నాబాద్ లో తిరుగుబాటు  మొదలైందా ?
X

అనుకున్నట్లే కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ మాజీ ఎంఎల్ఏ ప్రవీణ్ రెడ్డి తన మద్దతుదారులతో సమావేశం పెట్టుకున్నారు. మధ్యాహ్నం పైన భేటీ వుండబోతోందని సమాచారం. పార్టీ ప్రకటించిన రెండో జాబితాలో 45 మందికి టికెట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. టికెట్ ఆశించిన ప్రవీణ్ రెడ్డికి కాకుండా పార్టీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కు టికెట్ ఖాయంచేసింది. దాంతో ప్రవీణ్ మండిపోతున్నారు.

రెండో జాబితాను అధిష్టానం ఇలా విడుదల చేసిందో లేదో హుస్నాబాద్ లో అలా తిరుగుబాటు మొదలైపోయింది. తిరుగుబాట్లు హుస్నాబాద్ తోనే ఆగదని మరో 20 నియోజకవర్గాల్లో పరిస్ధితి ఇలాగే ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు కాకుండా చివరినిముషంలో వచ్చి పార్టీలో చేరినవారికి ఢిల్లీ స్ధాయిలో కీలక నేతలను మ్యానేజ్ చేసుకున్న వారికి టికెట్లు దక్కినట్లుగా కొందరు మండిపోతున్నారు. అధిష్టానం విడుదల చేసినమొదటి జాబితాలోని 55 టికెట్ల విషయంలో పెద్దగా అసంతృప్తులు, తిరుగుబాట్లు కనబడలేదు.

అయితే రెండో జాబితాలో ప్రకటించిన 45 టికెట్ల విషయంలో మాత్రం గోల మొదలైపోయింది. ప్రవీణ్ రెడ్డి మార్గంలోనే జూబ్లిహిల్స్ టికెట్ ఆశించి భంగపడిన విష్ణువర్ధనరెడ్డి కూడా మద్దతుదారులతో సమావేశం పెట్టుకోబోతున్నారు. జూబ్లిహిల్స్ లో పోటీచేసే అవకాశం అధిష్టానం అజహరుద్దీన్ కు ఇచ్చింది. నిజానికి ఇక్కడ టికెట్ ప్రకటించకముందే విష్ణు-అజహర్ మధ్య చాలా గొడవలే అయ్యాయి. అయినా అధిష్టానం మాత్రం విష్ణుని కాదని అజహర్ వైపే మొగ్గుచూపింది.

పార్టీవర్గాల సమాచారం ప్రకారం మునుగోడు, ఎల్బీ నగర్, అసిఫాబాద్ లాంటి మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అసంతృప్తులు మెల్లిగా మొదలయ్యాయట. ఒకటిరెండు రోజుల్లోనే టికెట్ దక్కని అసంతృప్తులు మద్దతుదారులతో మీటింగులు పెట్టుకోబోతున్నారట. మరి వీళ్ళందరినీ పార్టీ ఏ విధంగా బుజ్జగించబోతోంది, బుజ్జగింపులకు వీళ్ళంతా ఎంతవరకు లొంగుతారు అన్నది చూడాలి. ఎందుకంటే వీళ్ళ అసంతృప్తి కంటిన్యు అయితే దాని ప్రభావం రాబోయే ఎన్నికల ఫలితాల మీద పడటం తప్పదనే టెన్షన్ పార్టీ అధిష్టానంలో మొదలైంది. చివరకు ఏమవుతుందో చూడాలి.