Begin typing your search above and press return to search.

భార్యల చేతిలో భర్తల హత్యలు: ఐదేళ్లలో 785 మంది బలి!

దేశవ్యాప్తంగా ఇటీవల భార్యల చేతిలో భర్తల హత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   15 July 2025 7:00 AM IST
భార్యల చేతిలో భర్తల హత్యలు: ఐదేళ్లలో 785 మంది బలి!
X

దేశవ్యాప్తంగా ఇటీవల భార్యల చేతిలో భర్తల హత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో ఐదు రాష్ట్రాల్లో ఏకంగా 785 మంది భర్తలు హత్యకు గురయ్యారని వెల్లడైంది. ఈ గణాంకాలు సమాజంలో పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు, వాటి వల్ల తలెత్తుతున్న దారుణ పరిణామాలను కళ్ళకు కడుతున్నాయి. ఒకప్పుడు మహిళల భద్రతపై చర్చ జరిగే చోట, ఇప్పుడు పురుషులు, ముఖ్యంగా భర్తల భద్రత ప్రశ్నార్థకంగా మారడం గమనార్హం.

-ఐదు రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితి

ఈ హత్యలు కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లోనూ ఎక్కువగా నమోదవుతున్నాయి. పోలీసులు విడుదల చేసిన గణాంకాలు ఈ పరిణామం యొక్క తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో ఈ ఐదేళ్లలో అత్యధికంగా 274 మంది భర్తలు హత్యకు గురయ్యారు. 2020లో 45, 2021లో 52, 2022లో 60, 2023లో 55, 2024లో 62 మంది బలయ్యారు. బీహార్ లో 186 మంది భర్తలు హత్యకు గురయ్యారు. 2020లో 30, 2021లో 35, 2022లో 40, 2023లో 39, 2024లో 42 మంది హత్యకు గురయ్యారు. రాజస్థాన్ లో 138 మంది భర్తలు హత్యకు గురయ్యారు. 2020లో 20, 2021లో 25, 2022లో 28, 2023లో 30, 2024లో 35 మంది హతమయ్యారు. మహారాష్ట్ర లో 100 మంది భర్తలు హత్యకు గురయ్యారు 2020లో 15, 2021లో 18, 2022లో 20, 2023లో 22, 2024లో 25 మంది అసువులు బాసారు. మధ్యప్రదేశ్ లో 87 మంది భర్తలు హత్యకు గురయ్యారు 2020లో 12, 2021లో 15, 2022లో 18, 2023లో 20, 2024లో 22 మంది మర్డర్ అయ్యారు.

- వివాహేతర సంబంధాలే ప్రధాన కారణం

పోలీసుల విచారణలో ఈ హత్యలకు ప్రధాన కారణం వివాహేతర సంబంధాలే అని తేలింది. కొందరు భర్తలు ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోగా మరికొందరు భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తలను అడ్డు తొలగించుకోవాలని చూశారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలు చివరకు దారుణ హత్యలకు దారి తీశాయి. ఈ కేసుల దర్యాప్తులో మొబైల్ కాల్ డేటా కీలక పాత్ర పోషించిందని పోలీసులు తెలిపారు. ఫోన్ లొకేషన్లు, సందేశాలు, కాల్ రికార్డుల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేయగలిగారు. ఇప్పటికే చాలామంది నిందితులు జైలు పాలయ్యారు.

- పెళ్లిపై పెరుగుతున్న భయం

ఈ తరహా ఘటనలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. "పెళ్లి" అనే బంధం పట్ల యువతలో భయం, అపనమ్మకం పెరుగుతోంది. హనీమూన్‌కు వెళ్లిన భర్తలను సైతం భార్యలు మోసపూరితంగా హత్య చేసిన కొన్ని ఉదాహరణలు సమాజంలో మరింత కలకలం రేపుతున్నాయి.

- సమాజానికి అవగాహన అత్యవసరం

ఈ సంఘటనలు మహిళలందరినీ తప్పుబట్టడానికి ఉద్దేశించినవి కావు, కానీ సమాజంలో చోటు చేసుకుంటున్న ఈ విపరీత ధోరణులను విశ్లేషించి, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. పురుషుల భద్రతను కూడా సమాజం సీరియస్‌గా పరిగణించాలి. సంబంధాలు నమ్మకం, ప్రేమ, గౌరవం మీద ఆధారపడి ఉండాలి తప్ప, పగ, ప్రతీకారాలకు వేదిక కారాదని నిపుణులు సూచిస్తున్నారు. సంసారంలో సమస్యలు ఎదురైనప్పుడు, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ, ప్రాణాలను బలి తీసుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని సమాజం గుర్తించాలి.

ఈ దారుణ ఘటనల నేపథ్యంలో, పెళ్లి పట్ల యువతలో నమ్మకాన్ని తిరిగి పెంపొందించడానికి సామాజిక అవగాహన కార్యక్రమాలు, కౌన్సిలింగ్‌లు అవసరమని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.