గర్భంతో ఉన్న భార్యను నడి రోడ్డు మీద అంత దారుణంగా కొట్టాడు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండే ఒక భర్త ఉదంతం షాకింగ్ గా మారింది.
By: Tupaki Desk | 7 April 2025 11:00 AM ISTవీడ్నేం అనాలి. వీడ్నేం చేయాలి? గర్బంతో ఉన్న భార్యను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు భిన్నంగా తప్పుల మీద తప్పులు చేస్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండే ఒక భర్త ఉదంతం షాకింగ్ గా మారింది. నడి రోడ్డు మీద గర్భంతో ఉన్న భార్యను సిమెంట్ ఇటుకతో తీవ్రంగా గాయపరిచి.. చనిపోయిందన్న ఉద్దేశంతో పారిపోయిన ఒక భర్త దుర్మార్గం గచ్చిబౌలిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
హఫీజ్ పేట ఆదిత్య నగర్ లో ఉండే 32 ఏళ్ల మహ్మద్ బస్ రత్ ఇంటీరియర్ పనులు చేస్తుంటాడు. 2023 జనవరిలో అజ్మీర్ దర్గాకు వెళ్లాడు. బస్సు ప్రయాణంలో అతడికి బెంగాల్ కు చెందిన 22 ఏళ్ల షబానా పర్వీన్ పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఆమెను 2024 అక్టోబరులో కోల్ కతాకు వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను తీసుకొని తాను ఉండే హఫీజ్ పేటకు తీసుకొచ్చాడు.
వేరే కాపురం పెడదామన్న పర్వీన్ ఒత్తిడితో తాను ఉండే ఇంటికి దగ్గర్లో మరో ఇంటిని అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు. పెళ్లికి ముందు తల్లిదండ్రులతో ఉండేవాడు. భార్య మాటలతో తప్పక వారికి దగ్గర్లో మరో ఇంటిని తీసుకున్నాడు. అప్పటి నుంచి భార్యతో విభేదాలు మొదలయ్యాయి. తరచూ గొడవ పడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పర్వీన్ గర్భం దాల్చింది. రెండు నెలల గర్భంతో ఉన్న ఆమెకు వాంతులు ఎక్కువ కావటంతో మార్చి 29న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఏప్రిల్ 1 రాత్రి ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు మళ్లీ గొడవపడ్డారు.
అది కాస్తా పెరిగి పెద్దదైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బస్ రత్ భార్యను ఆసుపత్రి ఎదురుగా ఉన్న రోడ్డు మీద పడేసి ఇష్టానుసారం దాడి చేశాడు. పక్కనే ఉన్న సిమెంట్ ఇటుక తీసుకొని ఆమె తల మీద పలుమార్లు కొట్టాడు. దీంతో ఆమె స్ప్రహ తప్పిపోయింది. ఆమె చనిపోయిందనుకొని అక్కడి నుంచి పారిపోయాడు.అయితే.. తలకు బలమైన గాయం తగలటంతో కోమాలోకి వెళ్లిన ఆమెను నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడ్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపారు. తాజాగా.. ఈ ఉదంతానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ బయటకు రావటంతో.. అతడి దారుణం మరోసారి చర్చగా మారింది.
