Begin typing your search above and press return to search.

తిరుగులేని దేశీయ కుబేరుడు అంబానీ.. అదానీ లెక్కేమంటే?

తాజా నివేదికను ఆగస్టు 30 నాటికి కటాఫ్ డేట్ గా పెట్టుకున్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపద రూ.8.06 లక్షల కోట్లకు చేరుకుంది

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:23 AM GMT
తిరుగులేని దేశీయ కుబేరుడు అంబానీ.. అదానీ లెక్కేమంటే?
X

మూడు నెలలకు ఒకసారి విడుదల చేసే ''360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్టు 2023'' రిపోర్టు విడుదలైంది. అంచనాలకు తగ్గట్లే.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మొదటిస్థానంలో నిలిచారు. దేశీయ కుబేరుడిగా తన సత్తా చాటారు. దేశంలోని మొత్తం 138 నగరాల్లోని సంపన్నుల వివరాల్ని సేకరించి మొత్తం 1319 మందికి ఈ జాబితాలో చోటు కల్పించారు. హిండెన్ బర్గ్ రిపోర్టు పుణ్యమా అని అదానీ సంపద కరిగిపోగా.. అంబానీ ఆస్తి మాత్రం అగ్రస్థానంలో నిలిచింది.

తాజా నివేదికను ఆగస్టు 30 నాటికి కటాఫ్ డేట్ గా పెట్టుకున్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపద రూ.8.06 లక్షల కోట్లకు చేరుకుంది. అదే సమయంలో గౌతమ్ అదానీ సంపద 57 శాతం తగ్గి.. రూ.4.74 లక్షల కోట్లకు పరిమితమైంది. అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా ఆయన ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు దెబ్బ తినటంతో.. ఆయన జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా సంపద 36 శాతం పెరిగి మూడో స్థానంలో నిలవగా.. నాలుగో స్థానంలో హెచ్ సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ నిలిచారు. గత నివేదికతో పోలిస్తే ఆయన సంపద 23 శాతం పెరిగినట్లుగా పేర్కొన్నారు.

టాప్ 10 జాబితాలో గోపీచంద్ హిందుజా.. దిలీప్ సింఘ్వి.. ఎల్ ఎన్ మిత్తల్.. కుమార మంగళం బిర్లా.. నీరజ్ బజాజ్ లు తమ స్థానాల్ని మెరుగుపర్చుకున్నారు. అనూహ్యంగా డిమార్ట్ అధినేత దమానీ తన సంపదలో 18 శాతం క్షీణత కారణంగా మూడు స్థానాలు కోల్పోయి.. టాప్ 5 స్థానే టాప్ 10లో ఎనిమిదో స్థానంలో నిలిచారు. మహిళల విషయానికి వస్తే.. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ ను స్వయంశక్తితో ఎదిగిన జోహోకు చెందిన రాధా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

భారతీయ కుబేరుల్లో అత్యంత పిన్న వయస్కుడిగా కైవల్య వోహ్రా నిలిచారు. ఇతగాడి వయసు అక్షరాల 20 ఏళ్లు మాత్రమే. జెప్టోకు చెందిన ఇతగాడు మొత్తం జాబితాలోని కుబేరుల్లో అత్యంత చిన్నవాడు. ఇక.. అత్యంత పెద్ద వయస్కుడిగా ప్రెసిషన్ వైర్స్ ఇండియాకు చెందిన 94 ఏళ్ల మహేంద్ర రాఠీలాల్ మొదటిసారి జాబితాలోకి చేరారు.

భారత్ టాప్ 10 కుబేరులు.. వారి సంపదను (రూ.కోట్లల్లో) చూస్తే..

ర్యాంక్ పేరు సంపద

01. ముకేశ్ అంబానీ 8,08,700

02. గౌతమ్ అదానీ 4,74,800

03. సైరస్ పూనావాలా 2,78,500

04. శివ్ నాడార్ 2,28,900

05. గోపీచంద్ హిందూజా 1,76,500

06. దిలీప్ సంఘ్వి 1,64,300

07. లక్ష్మీ మిత్తల్ 1,62,300

08. రాధాకిషన్ దమానీ 1,43,900

09. కుమార మంగళం బిర్లా1,25.600

10. నీరజ్ బజాజ్ 1,20,700

దేశ వ్యాప్తంగా ఈ జాబితాలో చేరిన కుబేరుల్ని చూస్తే.. ప్రతి మూడు వారాలకు ఒక కొత్త బిలియనీర్ భారత్ లో తయారవుతున్నారు. ప్రస్తుతం దేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు. పుష్కర కాలంతో పోలిస్తే దేశంలో బిలియనీర్ల సంఖ్య 4.4 రెట్లు పెరగటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే జాబితాలోని 51 మంది పారిశ్రామికవేత్తలు తమ సంపదను రెట్టింపు చేసుకున్నారు.

దేశంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న మహానగరంగా ముంబయి నిలిచింది. ఇక్కడ ఏకంగా 328 మంది బిలియనీర్లు ఉండగా.. తర్వాతి స్థానంలో ఢిల్లీ 199.. బెంగళూరులో వంద మంది బిలియనీర్లు ఉన్నట్లుగా నివేదిక వెల్లడించింది. జాబితాలో ఎక్కువ మందిలో ఉన్న టాప్ 20 నగరాల్లో మొదటిసారి తమిళనాడుకు చెందిన తిరువూరు చేరటం గమనార్హం.