Begin typing your search above and press return to search.

భారత కుబేరుల్లో ముకేశ్ అంబానీ..తెలుగు రాష్ట్రాలకు?

అపర కుబేరుల సంపద లెక్కల్ని తరచూ విడుదల చేసే హురున్ తాజాగా ఈ ఏడాది కుబేరుల జాబితాను వెల్లడించింది.

By:  Garuda Media   |   7 March 2026 10:44 AM IST
భారత కుబేరుల్లో ముకేశ్ అంబానీ..తెలుగు రాష్ట్రాలకు?
X

అపర కుబేరుల సంపద లెక్కల్ని తరచూ విడుదల చేసే హురున్ తాజాగా ఈ ఏడాది కుబేరుల జాబితాను వెల్లడించింది. ఇందులో ప్రపంచ కుబేరుడు ఎవరు? టాప్ 10 సంపన్నుల జాబితాతో పాటు.. భారతదేశ కుబేరుడు.. దేశంలోని టాప్ 10 సంపన్నుల వివరాలు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సంపన్నుల వివరాల్ని వేర్వేరుగా వివరాలు వెల్లడించింది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా భారత కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గడిచిన ఏడాది కాలంలో అంబానీ కుటుంబ సంపద 9 శాతం పెరిగి రూ.9.8 లక్షల కోట్లకు పెరిగినట్లుగా రిపోర్టు వెల్లడించింది.

భారతదేశంలో మాత్రమే కాదు.. ఆసియాలోనూ కుబేరుడిగా ముకేశ్ నిలిచారు. ప్రపంచ సంపన్నుల్లో మాత్రం ఆయన 17వ స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. దేశీయంగా నెంబర్ టూ, త్రీ స్థానాల్లో గౌతమ్ అదానీ (రూ.7.5 లక్షల కోట్లు).. రోష్నీ నాడార్ (హెచ్ సీఎల్ టెక్, రూ.3.2 లక్షల కోట్లు) నిలిచారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే రోష్నీ నాడార్ మన టాప్ 10 బిలియనీర్లలోని ఏకైక మహిళగా నిలిచారు.

గమనించాల్సిన అంశం ఏమంటే.. గడిచిన ఏడాది కాలంలో అదానీ ఆస్తి 14 శాతం తగ్గితే.. నాడార్ సంపద 10 శాతం తగ్గింది. టాప్ 10 స్థానాల్లో ఈ ముగ్గురు తర్వాత జాబితాలో నిలిచిన సంపన్నులను చూస్తే..

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనావాలా (రూ.3 లక్షల కోట్లు)

ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధిపతి కుమార మంగళం బిర్లా (రూ.2.5 లక్షల కోట్లు)

సన్‌ఫార్మా దిలీప్‌ సంఘ్వీ (రూ.2.3 లక్షల కోట్లు)

విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీ (రూ.2.3లక్షల కోట్లు)

నీరజ్‌ బజాజ్‌ ఆటో కుటుంబం (రూ.2.2 లక్షల కోట్లు)

ఆశోక్‌ హిందుజా ఫ్యామిలీ (రూ.1.92 లక్షల కోట్లు)

డీమార్ట్‌ వ్యవస్థాపకులు రాధాకిషన్‌ దమానీ (రూ.1.5 లక్షల కోట్లు)

సంపద విషయంలో ప్రపంచ కుబేరుడికి.. భారత కుబేరుడికి మధ్య అంతరం చూస్తే.. ఎంత భారీ గ్యాప్ అన్నది ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచ కుబేరుడిగా ఐదో ఏడాది టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిలిచారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద 89 శాతం పెరిగి ఆయన సంపద మొత్తం అక్షరాల రూ.72 లక్షల కోట్లకు చేరింది. ముకేశ్ అంబానీ సంపదతో పోలిస్తే దగ్గర దగ్గర ఏడు రెట్లు అధికం కావటం గమనార్హం.

ప్రపంచ కుబేరుల జాబితాలో తెలుగు వారు పలువురు ఉన్నారు. తెలుగు వారికి సంబంధించి టాప్ 10 సంపన్నుల్లో తొలిస్థానం దివీస్ లేబొరేటరీస్ అధినేత మురళి దివి టాప్ స్థానంలో నిలిచారు. రెండు మూడుస్థానాల్లో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అధినేతలు పిచ్చిరెడ్డి.. క్రిష్ణారెడ్డిలు నిలిచారు. అరిస్టో ఫార్మాకు చెందిన ఉమాదేవీ ప్రసాద్, జీఎంఆర్ అధినేత జీఎం రావు.. హెటిరో అధినేత బి.పార్థసారథి రెడ్డి.. అరబిందో ఫార్మా అధినేత పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి.. ఎంఎస్ ఎన్ లేబొరేటరీస్ ఎం.సత్యనారాయణ రెడ్డి.. అపర్ణ కన్స్ట్రక్షన్స్ అధినేతలు వెంకటేశ్వరరెడ్డి.. సుబ్రమణ్యం రెడ్డి.. మైహోం ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు.. డాక్టర్ రెడ్డీస్ అధినేత సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సంపన్నుల్లో అత్యధికులు ఫార్మా.. హెల్త్ రంగానికి చెందిన వారే ఉండటం విశేషం.