Begin typing your search above and press return to search.

మనుషుల మలానికి కోట్లు.. ఓ కంపెనీ షాకింగ్ ఆఫర్!

వైద్య పరిశోధనల నిమిత్తం మానవుల నుంచి వివిధ రకాల శాంపిల్స్‌ సేకరిస్తుంటాయి పలు కంపెనీలు

By:  Tupaki Desk   |   24 May 2024 2:48 PM IST
మనుషుల మలానికి కోట్లు.. ఓ కంపెనీ షాకింగ్ ఆఫర్!
X

వైద్య పరిశోధనల నిమిత్తం మానవుల నుంచి వివిధ రకాల శాంపిల్స్‌ సేకరిస్తుంటాయి పలు కంపెనీలు. ఈ క్రమంలో కొన్నిసార్లు వ్యర్థాలు, విసర్జితాలను కూడా పరీక్షించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సంస్థ.. మనుషుల మలాన్ని తమ పరిశోధనల్లో పరీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు మలవిసర్జన నమూనాలు పంపించాలని ప్రజలను కోరుతోంది. పంపిన వారికి కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించింది.

అవును... సాధారణంగా రోగ నిర్ధారణలు, వైద్య పరిశోధనల నిమిత్తం పలు కంపెనీలు మానవుల నుంచి రక్తం, మూత్రం వంటి శాంపిల్స్ సేకరిస్తుంటాయి. కొన్నిసార్లు వ్యర్థాలు, విసర్జితాలను కూడా పరిశోధకులు పరీక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా ముఖ్యమైన ప్రయోగం కోసం ఓ సంస్థ మనుషుల మలాన్ని పరీక్షించాలాని డిసైడ్ అయింది. అందుకోసం భారీ మొత్తంలో ఆఫర్ చేస్తుంది.

సాధారణంగా పలు రకాల వ్యాధులకు.. బ్యాక్టీరియాలు, వైరస్‌ లు కారణం అవుతుంటాయి. అయితే... కొంతమంది పేగుల్లో ఉండే ఒకే రకమైన రోగకారక బ్యాక్టీరియాలో విభిన్నమైన స్ట్రెయిన్స్ ఉంటున్నట్లు వైద్య పరిశోధకులు ఇప్పటికే గుర్తించారు. అయితే.. అవి అలా ఎందుకు ఉంటాయనేది మాత్రం సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయిందట. ఈ నేపథ్యంలో... హ్యూమన్ మైక్రోబ్స్ అనే సంస్థ మానవ విసర్జితాలను పరీక్షించాలని నిర్ణయించింది.

ఈ సమయంలో మానవ మలానికి ధరను ఫిక్స్ చేసింది. ఇందులో భాగంగా... ఎవరైనా తమ మలాన్ని శాంపిల్ రూపంలో పంపిస్తే ఒక శాంపిల్‌ కు 500 డాలర్లు (సుమారు రూ.41,000) ఇస్తామని హ్యూమన్ మైక్రోబ్స్ ప్రకటించింది. అదే విధంగా... ప్రతీరోజూ మల విసర్జన శాంపిల్స్ పంపేవారికైతే సంవత్సరానికి రూ.1,80,000 డాలర్లు (సుమారు రూ.1 కోటి 40 లక్షలు) ఇస్తామని.. ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా తమ మలాన్ని పంపవచ్చని తెలిపింది.

అయితే మనిషి మలంలో ఉండే హోస్ట్ - నేటివ్ మైక్రోబ్ అనే అత్యంత ముఖ్యమైన బ్యాక్టీరియాను కనుగొనడానికే సదరు సంస్థ ఈ పరీక్షలు చేస్తోందని తెలుస్తోంది. ఇది కేవలం 0.1 % మంది ప్రజల మలంలో మాత్రమే ఉండే అరుదైన బ్యాక్టీరియా కావడంతో... ఇంత భారీ ఆఫర్ ప్రకటించి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.