Begin typing your search above and press return to search.

పరుగు పందెంలో మనుషులతో పోటీకి దిగిన రోబో

మనిషి సృష్టించిన మరమనిషి మనిషికి మించి పని చేయటం తెలిసిందే. అయితే.. మనుషులతో పోటీకి మరమనిషిని దింపిన తొలి పోటీ చైనాలో జరిగింది.

By:  Tupaki Desk   |   20 April 2025 10:23 AM IST
Humanoidrobots,Chinamarathon,Robotrace,Beijinghalfmarathon,robotvshuman,AIrobotics,Latestnews
X

మనిషి సృష్టించిన మరమనిషి మనిషికి మించి పని చేయటం తెలిసిందే. అయితే.. మనుషులతో పోటీకి మరమనిషిని దింపిన తొలి పోటీ చైనాలో జరిగింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా 21 హ్యూమనాయిడ్ రోబోలు 21 కిలోమీటరల పరుగుపందెంలో మనుషులతో పోటీగా పరుగులు తీసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మనుషులతో సమానంగా పరుగుకు ప్రయత్నించటంతో ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్ రోబో హాఫ్ మారథాన్ కొత్త చరిత్రకు తెర తీసింది. ఈ వీకెండ మిగిలిన ప్రపంచానికి భిన్నంగా చైనా రాజధాని బీజింగ్ లో విచిత్రమైన పోటీని నిర్వహించారు.

మనిషి క్రియేట్ చేసిన మరమనిషి.. అదే మనిషితో పోటీ పడుతుండటం.. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరగటంతో ఈ పోటీని తిలకించేందుకు జనం తండోపతండాలుగా విచ్చేశారు. పోటీ జరిగే ప్రాంతం మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. రోబోలతో ఫోటోలు.. వీడియోలు.. సెల్ఫీలు దిగేందుకు ఆరాటపడ్డారు. ట్రాక్ మీద మరమనుషులు పరుగులు తీస్తుంటే.. జనం ఉత్సాహంగా విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టారు.

అమెరికా రోబోలిక్స్ కంపెనీలతో పోటీ పడుతూ హ్యూమనాయిడ్ రోబోల రంగంలో అధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో దేశ రాజధాని బీజింగ్ లో ఇజువాంగ్ హాఫ్ మాథాన్ ను నిర్వహించారు. ఈ పోటీకి సంబంధించిన జాగ్రత్తలు.. ముందస్తు ఏర్పాట్లు అందరిని ఆకర్షించేలా ఉన్నాయి. ఫార్ములా 1 కార్ల రేసులో మార్గమధ్యంలో కార్ల టైర్లు పాడైతే.. వెంటనే ట్రాక్ పక్కనే ఆపేస్తారు. అక్కడి సిబ్బంది సెకన్ల వ్యవధిలో టైర్లు మార్చేసి వెంటనే రేస్ కంటిన్యూ చేసేలా సాయం చేస్తారు.

తాజాగా జరిగిన హాఫ్ మారథాన్ లోనూ ఇదే నియమాన్ని పాటించారు. వేగంగా పరిగెత్తే రోబోల బ్యాటరీలు పాడైనా.. ఛార్జింగ్ అయిపోయినా అక్కడికక్కడే ఆగిపోకుండా పక్కనే స్టాప్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వెంటనే వాటి బ్యాటరీలు మార్చుకొని రోబోలు పరుగు కంటిన్యూ చేసేలా ప్లాన్ చేశారు. అంతేకాదు.. ఒక రోబోతో మరో రోబో ఢీకొట్టకుండా ఉండేందుకు వీటిని సమాంతరంగా 1-2 మీటర్ల దూరంలో నిలబెట్టి పోటీ నిర్వహించారు. ఈ రేసులో ఒకే డిజైన్ తో కాకుండా భిన్నమైన ఆకారాల్లో పరిమాణాల్లో ఉన్న రోబోల్ని రంగంలోకి దించారు. మారథాన్ పూర్తైన తర్వాత పలు విభాగాల్లో రోబోల్ని తయారు చేసిన కంపెనీలకు అవార్డులు ఇచ్చారు.