Begin typing your search above and press return to search.

3 లక్షల ఏళ్ల నుంచి... మనిషికి మాత్రమే ఇది ఎలా సాధ్యం?

ఎలాంటి పరిశరాల్లో అయినా బతకగలిగే ప్రాణి మనిషి ఒక్కడే అని.. ఇతర జాతులకు ఇది ఎందుకు సాధ్యం కాలేదన్నది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలి ఉందని అమెరికా, జర్మనీ పరిశోధకులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 8:48 AM IST
3 లక్షల ఏళ్ల నుంచి... మనిషికి మాత్రమే ఇది ఎలా సాధ్యం?
X

ఈ విశ్వంలో కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి. భూమిపై బ్రతికేవి, నీతిలో ఉండేవి, గాల్లో ఎగిరేవి, ఈ మూడింటిలో కనీసం రెండు చోట్ల జీవించగలివేవి.. ఇలా రకరకాల కేటగిరీల్లో ఈ భూమిపై అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. వాటిలో మనిషి ఒకడు. అయితే.. ప్రపంచంలోని మిగిలిన అన్ని ప్రాణులనూ ఇతడు గ్రిప్ లో పెట్టి ఆడిస్తుంటాడు.. బ్రతికేస్తుంటాడు!

అయితే.. అసలు మనిషికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి. ప్రత్యేకంగా ఒక చోట అని కాకుండా.. ఎక్కడ బడితే అక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో బడితే అలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి పరిసరాల్లో అయితే అలాంటి పరిసరాల్లో ఎలా బ్రతుకుతున్నాడు? అలా బ్రతకగలిగే ప్రాణి కూడా మానవుడు ఒక్కడే ఎలా? ఈ విషయాలపై తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు స్పందించారు.

అవును... ఎలాంటి పరిశరాల్లో అయినా బతకగలిగే ప్రాణి మనిషి ఒక్కడే అని.. ఇతర జాతులకు ఇది ఎందుకు సాధ్యం కాలేదన్నది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలి ఉందని అమెరికా, జర్మనీ పరిశోధకులు చెబుతున్నారు. వారి అధ్యయనం తాజాగా నేచర్ పత్రికలో ప్రచురితమైంది. లక్షల సంవత్సరాల క్రితమే మానవ జాతి ఆవిర్భవించిందని ఈ అధ్యయనం పేర్కోంది.

ఇందులో భాగంగా... ఆఫ్రికాలో 3,00,000 సంవత్సరాల క్రితమే మానవ జాతి ఆవిర్భవించిందని.. మొదట్లో మానవులు ఆఫ్రికాలోని గడ్డి మైదానాల్లో నివసించారని.. అక్కడ చెదురుమదురుగా చెట్లు ఉండేవని తెలిపారు. అలాంటి చోట పుట్టిన మనిషి... నేడు దట్టమైన వర్షారణ్యాల్లో, మండుటెండల ఎడారుల్లోనూ, చల్లని టండ్రా భూముల్లోనూ జీవించగలుగుతున్నాడు.

అయితే... ఇది మరే జీవజాతికీ సాధ్యం కాలేదని.. మనిషికి మాత్రమే ఇలా ఏ పరిశరాల్లో అయినా జీవించగలిగే సత్తా ఉందని చెప్పిన శాస్త్రవేత్తలు... సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఆఫ్రికాలోని గడ్డి మైదానాల్లో సంచరించిన మానవ జాతి (హోమో సెపియన్స్).. 50,000 సంవత్సరాల క్రితం నుంచి ఇతర ఖండాలకు పాకిందని వెల్లడించారు.

సుమారు 70,000 ఏళ్ల క్రితమే ఆఫ్రికా నుంచి వలసలు మొదలైనప్పటికీ.. 50,000 ఏళ్ల తరువాత నుంచే ఇతర ప్రాంతాల్లో మానవులు స్థిర నివాసం ఏర్పరచుకోగలిగారని చెప్పిన పరిశోధకులు... నియాండర్‌ తల్‌ మానవుల వంటివారూ ఆఫ్రికా వెలుపల జీవించినా చివరకు హోమో సేపియన్స్‌ మాత్రమే బతికి బట్టకట్టారని అన్నారు. అయితే... దీనికి గల కారణమేమిటో ఇప్పటికీ తెలియదని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... సుమారు 14,000 సంవత్సరాల క్రితం వరకు చాలా మంది మానవులకు ముదురు రంగు చర్మం, గోధుమ రంగు జుట్టు, గోధుమ రంగు కళ్ళు ఉండేవని చెప్పిన పురాతన జన్యుశాస్త్ర నిపుణులు.. 14,000 - 3,000 సంవత్సరాల మధ్య మనిషి డీ.ఎన్.ఏ లోని అక్షరాలలో మార్పులు మొదలయ్యాయని.. ఫలితంగా రంగులో మార్పులొచ్చాయని తెలిపారు.

ఇందులో భాగంగా... లేత రంగు చర్మం, జుట్టు, కళ్ళకు కారణమయ్యాయని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర ఐరోపా వంటి తక్కువ ఎండ వాతావరణంలో నివసించే ప్రజలలో ఇవి సాధారణమయ్యాయని వెల్లడించారు. ఉత్తరాది ప్రాంతాలలోని ప్రజలు తేలికైన చర్మాన్ని కలిగి ఉండటానికి ఒక కారణం... సూర్యకిరణాలు ఉత్తరం వైపు ఎక్కువ దూరం తాకినప్పుడు వాటి శక్తి తక్కువగా ఉంటుందని తెలిపారు.

అందువల్ల.. ఈ ప్రదేశాలలో ప్రజలు తగినంత విటమిన్ డి పొందడంలో ఇబ్బంది పడతారని వెల్లడించారు. అయితే... నేడు ఏ రంగు చర్మం ఉన్నవారైనా ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలరని.. అందుకు కారణం.. మానవులు పాలు, చేపలు వంటి ఆహారాల నుండి విటమిన్ డి ఎలా పొందాలో నేర్చుకున్నారని పేర్కొన్నారు.