Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... "ప్రజాదర్బార్‌" కు భారీ స్పందన!

అవును... కొత్తగా నియమితులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌ లో "ప్రజాదర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించారు.

By:  Tupaki Desk   |   8 Dec 2023 9:48 AM GMT
వైరల్  ఇష్యూ... ప్రజాదర్బార్‌ కు భారీ స్పందన!
X

చెప్పినట్లుగానే తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజాదర్బార్‌ ను ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ప్రజల నుంచి ఆయన పలు అర్జీలను స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించిన రేవంత్ రెడ్డి వాటిని పరిశీలించారు. వారి సమస్యలను ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

అవును... కొత్తగా నియమితులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌ లో "ప్రజాదర్బార్" కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో అక్కడ గణనీయమైన సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తూ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ప్రజలు భవనం ముందు, శిలాఫలకం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా శిలాఫలకంపై కేసీఆర్ పేరు కనిపించకుండా బురద రుద్దడం గమనార్హం.

ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ తో హాజరైన వారికి వారి సమస్యలను విన్నవించుకునే అవకాశం కల్పించారు. దీంతో అధికారులు వారి వారి దరఖాస్తుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ వరద బాధితులు తమకు పరిహారం అందలేదని సీఎం రేవంత్‌ కు విన్నవించారు. దీనికి స్పందించిన రేవంత్ వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

రేవంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్ కార్యక్రమ కోసం ఒక ప్రత్యేక యంత్రాంగం కేటాయించబడింది. ఇందులో ప్రజల నుండి వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించడానికి సుమారు 20 మంది సిబ్బందిని నియమించారు. ఇదే సమయంలో ఫిర్యాదుల పరిష్కారంలో పురోగతిని కనుగునేందుకు నెలవారీ సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.

కాగా... శుక్రవారం నుంచి ప్రజాదర్బార్‌ ను ప్రారంభించనున్నట్లు గురువారం తన ప్రమాణస్వీకారం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాభవన్‌ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు.