Begin typing your search above and press return to search.

ఇదో రకం ఆసక్తి... 2290లో ఆ లిస్ట్ లో ఎంతమంది ఉంటారో

ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలైనప్పటికీ... ఎగ్జాట్ పోల్ ఫలితాల కోసం పార్టీలు, ప్రజలు, నేతలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు!

By:  Tupaki Desk   |   2 Dec 2023 10:30 AM GMT
ఇదో రకం ఆసక్తి... 2290లో ఆ  లిస్ట్  లో ఎంతమంది ఉంటారో
X

తెలంగాణలో కూడ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తవ్వడంతో దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికలు చివరి దశకు వచ్చినట్లయ్యింది. ఇక ఆదివారం విడుదలయ్యే ఫలితాలపైనే ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలైనప్పటికీ... ఎగ్జాట్ పోల్ ఫలితాల కోసం పార్టీలు, ప్రజలు, నేతలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు!

ఇప్పటివరకూ వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ కు తెలంగాణతోపాటు ఛతీస్ గఢ్ లో కూడా గుడ్ న్యూస్ చెప్పగా... రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కూడా సత్తాచాటే అవకాశాలున్నాయని చెబుతుంది. ఈ నేపథ్యంలో... ఎన్నికలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం!

వాస్తవంగా ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయంటే... రికార్డ్ మెజారిటీలతో గెలిచేవారు ఏ విధంగా అయితే ఉంటారో.. వరుసపెట్టి గెలుస్తున్న నేతలు ఎలాగైతే ఉంటారో.. అదే విధంగా డిపాజిట్లు కోల్పోయిన నేతలకు కూడా కొదువ ఉండదు. వరుసపెట్టి ఓడిపోతూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నవారికీ లోటుండడు. ఈ సందర్భంగా అసలు డిపాజిట్ కోల్పోవడం అంటే ఏమిటనేది ఇప్పుడు చూద్దాం!

ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తి నామినేషన్‌ పత్రం దాఖలు చేసేటప్పుడే కొంతమొత్తాన్ని డిపాజిట్ గా చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ 1951నాటి ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 34(1)(ఎ) నిబంధన ప్రకారం జరుగుతుంది. ఇందులో భాగంగా... లోక్‌ సభకు పోటీ చేయాలనుకునే జనరల్ అభ్యర్థి రూ.25వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉండగా... ఎస్సీ, ఎస్టీలు రూ.12,500 చెల్లిస్తే సరిపోతుంది.

ఇదే క్రమంలో అదే శాసనసభకు పోటీ చేయాలంటే సదరు జనరల్ అభ్యర్థి రూ.10వేలు కట్టాల్సి ఉండగా... ఎస్సీ, ఎస్టీలు ఐదు వేలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధంగా డిపాజిట్ చేసిన వ్యక్తి పోటీ చేసిన ఎన్నికల్లో.. పోలైన ఓట్లలో ఆరింట ఒక వంతు.. అంటే, 16.6 శాతం ఓట్లు సాధించగలిగితే ఈ సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు.

అలా కాకుండా... పోటీచేసిన అభ్యర్థుల్లో ఎవరికైతే ఆరింట ఒక వంతు ఓట్లు కూడా రావో.. వారు డిపాజిట్ కోల్పోయినట్లన్న మాట. అలాంటి వారికి డిపాజిట్ సొమ్మును వెనక్కి ఇవ్వరు. దాన్ని డిపాజిట్ జప్తు చేయడం అని అంటారు. అలా కాకుండా... నామినేషన్‌ ఉపసంహరించుకున్నా, ఆరింట ఒక వంతు ఓట్లు సాధించినా, గెలిచినా ఈ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు.

కాగా... తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం మొదలైన పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కలిపి మొత్తం 2290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి భవితవ్యం ఆదివారం విడుదలయ్యే ఫలితాలు తేటతెల్లం చేయబోతున్నాయి!