Begin typing your search above and press return to search.

ఈ నిజం మరిస్తే ఎలా.. కేటీఆర్‌?

చివరకు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్వయంగా కేసీఆరే కామారెడ్డి నుంచి పరాజయం పాలయ్యారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 6:04 AM GMT
ఈ నిజం మరిస్తే ఎలా.. కేటీఆర్‌?
X

మూడోసారి కూడా వరుసగా గెలిచి తెలంగాణలో హ్యాట్రిక్‌ సృష్టించాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ పెద్ద కలలే కన్నారు. అయితే ఆ కలలు కల్లలయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ రెడ్డిలాంటి వాగ్ధాటి ఉన్న నేత, సమర్థుడు దొరకడంతో ఆ పార్టీ చేతిలో బీఆర్‌ఎస్‌ కు చావుదెబ్బ తప్పలేదు. చివరకు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్వయంగా కేసీఆరే కామారెడ్డి నుంచి పరాజయం పాలయ్యారు.

అయితే.. ‘కింద పడ్డా.. మా చేయి పైనే ఉంది’ అన్నట్టు ఇప్పటికే పరాజయ కారణాలు ఏవో తెలుసుకోకుండా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని ఆయన తక్కువ చేసి చూపడానికి తరచూ తమకంటే ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 1.5 శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని చెబుతున్నారు. ఇక్కడే కేటీఆర్‌ పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రం మొత్తం మీద ఓవరాల్‌ గా చూసినప్పుడు కేటీఆర్‌ చెప్పేది కొంతవరకు నిజమే అయినప్పటికీ ప్రాంతాలవారీగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాలవారీగా చూసినప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య దాదాపు 10 శాతం తేడా ఉందని అంటున్నారు.

ఉద్యమ సమయంలో ఆంధ్రులను నోటికొచ్చినట్టు కేసీఆర్‌ తిట్టిపోశారు. ఆ ఆంధ్రులు ఆదుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కు ఆ మాత్రం సీట్లయినా వచ్చాయని అంటున్నారు. లేదంటే 20లోపు సీట్లకు పరిమితమయ్యేదని గుర్తు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ కు వచ్చిన 39 సీట్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే అత్యధికం ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దూసుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ లో అడ్డుకట్ట పడింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ కు జైకొట్టి ఉంటే కాంగ్రెస్‌ పార్టీ 80 సీట్లను దాటిపోయేది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ 20లోపు సీట్లతో పతనమయ్యేది. వాస్తవం ఇదయితే కేటీఆర్‌ కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ విజయాలనే తలకెత్తుకుని బీఆర్‌ఎస్‌ కు, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఓట్ల తేడా 1.5 శాతం మాత్రమేనని చెబుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చూసినప్పుడు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కు మధ్య ఓట్ల తేడా దాదాపు 10 శాతం ఉందని అంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో 64 స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ పార్టీకి 92,35,792 ఓట్లు వచ్చాయి. 39.40 శాతం ఓట్లు సాధించింది. బీఆర్‌ఎస్‌ కు 87,53,924 ఓట్లు వచ్చాయి. 37.35 శాతం ఓట్లను బీఆర్‌ఎస్‌ సాధించింది.

దీని ప్రకారం.. కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్‌ కంటే 4,81,868 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చినట్లు. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి (ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి)లోని 25 సీట్లను మినహాయిస్తే అసలు వాస్తవం బోధపడుతోంది. బీఆర్‌ఎస్‌ కు గ్రేటర్‌ హైదరాబాద్‌ లో సీమాంధ్రులు జైకొట్టడంతో ఆ పార్టీ బతికి బట్టకట్టింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ ఒక్క చోటే గెలుపొందింది. బీజేపీ ఒక్క స్థానం, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 25.53 శాతం మాత్రమే. సీమాంధ్రులు ఆదుకోవడంతో బీఆర్‌ఎస్‌ కు 38.97 శాతం ఓట్లు వచ్చాయి.

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌ ను మినహాయించి తెలంగాణవ్యాప్తంగా చూసినప్పుడు బీఆర్‌ఎస్‌ చావుదెబ్బ తింది. బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ పార్టీకి దాదాపు 10 శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ కలిపి కాంగ్రెస్‌కు 83,10,792 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ 71,76,924 ఓట్లు మాత్రమే సాధించింది. బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌ కు 11,33,868 ఓట్లు అధికంగా వచ్చాయి.

51 సీట్లున్న ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్‌ 33 సీట్లతో 41.26 శాతం ఓట్లు సాధించింది. బీఆర్‌ఎస్‌ కేవలం 10 సీట్లకే పరిమితమైంది. 34.64 శాతం ఓట్లకే పరిమితమైంది. ఇక 43 సీట్లున్న దక్షిణ తెలంగాణలో 30 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ కు 45.86 శాతం ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ ఇక్కడ 13 సీట్లలో విజయం సాధించింది. 39.29 శాతం ఓట్లు మాత్రమే లభించాయి.

ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ వరకు ఫలితాలను చూసుకుని మురిసిపోతే బీఆర్‌ఎస్‌ కు మరోసారి షాక్‌ తప్పదని అంటున్నారు. ప్రాంతాలవారీగా, జిల్లాలవారీగా, గ్రామాలు, పట్టణాల వారీగా ఎక్కడ లోపాలు జరిగాయో, బీఆర్‌ఎస్‌ కు, కాంగ్రెస్‌ కు మధ్య ఓట్ల తేడా ఎంత ఉందో తెలుసుకోకపోతే కేసీఆర్‌ కు, కేటీఆర్‌ కు వచ్చే ఎన్నికల్లో మరోసారి తలబొప్పి కట్టడం ఖాయమంటున్నారు.