Begin typing your search above and press return to search.

అమెరికాకు ఎర్రసముద్రం నుంచి హెచ్చరికలు... వాట్ నెక్స్ట్?

పశ్చిమాసియా రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:35 AM IST
అమెరికాకు ఎర్రసముద్రం నుంచి హెచ్చరికలు... వాట్  నెక్స్ట్?
X

పశ్చిమాసియా రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. తొమ్మిది రోజులుగా ఇరు దేశాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ పై దాడికి అగ్రరాజ్యం సిద్ధమవుతున్నట్లు కథనాలొస్తున్నాయి. దీనిపై ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాకు ఎర్రసముద్రం నుంచి హెచ్చరికలు వచ్చాయి.

అవును... భీకరంగా జరుగుతున్న ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధంలో అమెరికా ఎంట్రీ త్వరలో ఉండొచ్చనే కథనాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఈ యుద్ధంలో వాషింగ్టన్‌ జోక్యం చేసుకుంటే ప్రతి ఒక్కరికీ ప్రమాదం పొంచి ఉన్నట్లేనని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో... తాజాగా అగ్రరాజ్యానికి యెమన్‌ కు చెందిన హూతీ తిరుగుబాటుదారుల నుంచి హెచ్చరికలు జారీ చేశారు.

ఇందులో భాగంగా... ఇరాన్‌ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ తో అమెరికా జట్టుకడితే.. ఎర్ర సముద్రంలోని అగ్రరాజ్య నౌకలు, యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుంటాం అంటూ హూతీ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆ సంస్థ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ యహ్యా సారీ ఓ వీడియో విడుదల చేశారు. దీంతో... దీన్ని ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామంగా చూస్తున్నారు.

హూతీలకు ఇరాన్ మద్దతున్న సంగతి తెలిసిందే. వారి ఎదుగుదలలో టెహ్రాన్ పాత్ర కీలకం అని చెబుతారు. ఈ క్రమంలో.. గతంలోనూ వాణిజ్య నౌకలను హూతీలు లక్ష్యం చేసుకోగా.. అమెరికా సైన్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇందులో భాగంగా.. యెమెన్‌ రాజధాని సనాతోపాటు అల్‌ బైదా, సదా, రాడాలే లక్ష్యంగా దాడులు చేపట్టాయి.

కాగా... ఇరాన్‌ లోని అణుస్థావరాలే లక్ష్యంగా 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరున ఇజ్రాయెల్‌ వరుస దాడులకు పాల్పడుతోన్న సంగతి తెలిసిందే. తమకు ముప్పు పొంచి ఉండడం వల్లే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో టెహ్రాన్‌ సైతం టెల్‌ అవీవ్‌ పై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే వైట్ హౌస్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

ఇందులో భాగంగా... ఇరాన్‌ పై సైనిక చర్య చేపట్టే విషయంలో రెండు వారాల్లోగా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తీసుకుంటారని ప్రకటించింది. దీంతో ఈ యుద్ధంలో అమెరికా కూడా పాల్గొంటే పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హుతీల నుంచి అమెరికాకు హెచ్చరికలు వచ్చాయి!