Begin typing your search above and press return to search.

ఏపీలో అంతే: ఇంట్లో భేటీకి అనుమతి తీసుకోవాలట

ఎన్నికల వేళ అధికారుల తీరుపై వస్తున్న విమర్శలు ఏపీలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   24 March 2024 4:45 AM GMT
ఏపీలో అంతే: ఇంట్లో భేటీకి అనుమతి తీసుకోవాలట
X

ఎన్నికల వేళ అధికారుల తీరుపై వస్తున్న విమర్శలు ఏపీలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. కొందరు అధికారుల తీరు అవాక్కు అయ్యేలా మారుతోంది. తాజా ఉదంతం అందుకు నిదర్శనంగా చెప్పాలి. కాకినాడ జిల్లా కాకినాడ గ్రామీణ మండలంలోని తిమ్మాపురంలో బీజేపీ జిల్లా కార్యదర్శి కాళ్ల ధనరాజు ఇంట్లో మిత్రపక్షాల నేతలతో కూడిన భేటీ ఒకటి తాజాగా జరిగింది. అయితే.. ఈ భేటీకి అనుమతులు తీసుకోలేదంటూ అధికారులు అడ్డుకున్న వైనం వివాదస్పదంగా మారింది.

పార్టీ కార్యాలయం కాకుండా.. పార్టీ కార్యకలపాలు నిర్వహించే ప్రాంగణం కానప్పుడు.. ఒక ఇంట్లో కొందరు కలిసి మాట్లాడుకోవటానికి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. అయితే.. ఇదంతా తమకు తెలీదని.. తమ వద్ద పర్మిషన్ తీసుకోలేదన్న అంశాన్ని అధికారులు ఎత్తి చూపటంతో బీజేపీ మిత్రపక్షాలు కంగుతిన్న పరిస్థితి. తిమ్మాపురం ఇన్ ఛార్జి పంచాయితీ కార్యదర్శి ప్రియాంక ఫిర్యాదు చేయటం ఒక ఎత్తు అయితే.. దీనిపై స్పందించిన ఎంపీడీవో రమేశ్ నాయుడు.. ఎస్ఐ రవీంద్ర బాబులు.. ఇతరులు వెళ్లి సమావేశాన్ని అడ్డుకున్నారు.

ఈ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఇంట్లో భేటీకి పర్మిషన్ అవసరమని ఏ నిబంధన చెబుతుందన్న ప్రశ్నను కూటమి నేతలు ప్రశ్నించగా.. దానికి సమాధానం చెప్పని అధికారులు భేటీకి పర్మిషన్ కావాలన్న అంశం మీదనే ఫోకస్ పెట్టటం గమనార్హం. ప్రచారం చేయకుండా.. ప్రచార సామాగ్రి లేకుండా ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే అభ్యంతరం పెట్టటం ఏమిటి? అని ప్రశ్నించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి.

తాము ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే.. పర్మిషన్ తీసుకోలేదని ప్రశ్నిస్తున్న అదికారులు.. వైసీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తన ఇంటి ఎదురుగా మున్సిపల్ స్థలంలో మీటింగ్ పెడుతుంటే అధికారులు.. పోలీసులు ఎలాంటి చర్య తీసుకోవటం లేదని కూటమి నేతలు వాపోతున్నారు. ఈ సీటు నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీ బరిలో ఉన్నారు. ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.