Begin typing your search above and press return to search.

240 మంది బందీల్లో 25 మంది విడుదల... ఏయే దేశాల వారంటే...?

దీంతో... ఇజ్రాయేల్, హమాస్ మధ్య సంధికి అమెరికాతోపాటు ఖతర్ దేశం ప్రయత్నాలు చేశారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 3:36 AM GMT
240 మంది బందీల్లో 25 మంది విడుదల... ఏయే దేశాల వారంటే...?
X

ఇజ్రాయేల్ పై ఆకస్మిక దాడులు చేసి సుమారు 1200 మందిని ఊచకోత కోసిన హమాస్ ఉగ్రవాదులు సుమారు 240 మందిని బందీలుగా చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఇజ్రాయేల్ పౌరులతోపాటు థాయిలాండ్, నేపాల్, అమెరికాకు చెందిన పౌరులు ఉన్నారు! దీంతో... తమ పౌరులను విడిపించుకోవడమే లక్ష్యంగా గాజాపా భూతల దాడులకు దిగింది ఇజ్రాయేల్ సైన్యం. ఈ దాడులతో గాజా గజగజ వణికింది. దీంతో... ఇజ్రాయేల్, హమాస్ మధ్య సంధికి అమెరికాతోపాటు ఖతర్ దేశం ప్రయత్నాలు చేశారు.

ఈ క్రమంలో ఈ సంధి ప్రకారం తాత్కాలిక కాల్పుల విరమణతోపాటు.. ఇటు హమాస్ నుంచి బందీలు, వారికి ప్రతిగా ఇజ్రాయేల్ నుంచి పాలస్థీనా ఖైదీలు విడుదలకు ఒప్పందం కుదిరింది. దీంతో... సుమారు నెలన్నరగా ఇజ్రాయెల్‌-హమాస్‌ ల మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లయ్యింది. ఇందులో భాగంగా తమ చెరలో ఉన్న 240 మంది బందీల్లో 25 మందిని హమాస్ ఉగ్రవాదులు విడుదల చేసినట్లు సమాచారం.

అవును... సంధిలో భాగంగా తమ వద్ద ఉన్న బందీలలో తొలివిడతలో 25 మందిని హమాస్ విడుదల చేసిందని తెలుస్తుంది. ఇందులో 13 మంది ఇజ్రాయెల్‌ కు చెందిన వారు కాగా, మరో 12 మంది థాయ్‌ లాండ్‌ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 13 మంది ఇజ్రాయెల్‌ పౌరులను విడుదల చేసిన హమాస్... వారిని రెడ్‌ క్రాస్‌ కు అప్పగించినట్లు సమాచారం అందిందని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో... తమ దేశానికి చెందిన 12 మంది బందీలను హమాస్‌ విడుదల చేసిందని థాయ్‌ లాండ్‌ కూడా ప్రకటించింది. ఈ మేరకు వారి విడుదలను థాయ్‌ ప్రధాని స్రెతా థావిసిన్‌ ధ్రువీకరించారు. తమ విదేశాంగశాఖ నుంచి ఈ మేరకు సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. వారిని తీసుకొచ్చేందుకు రాయబార బృందాలు బయల్దేరినట్లు ట్విటర్‌ వేదికగా స్రెతా థావిసిన్ వెల్లడించారు.

కాగా... అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ పై మెరుపు దాడులకు పాల్పడిన హమాస్‌ ఉగ్రవాదులు.. సుమారు 240 మందికిపైగా పౌరులను బందీలుగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో హమాస్‌ ను నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే బందీల విడుదల, కాల్పుల విరమణ కోసం కొంతకాలంగా అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. దీంతో... నాలుగురోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది.

ఈ ఒప్పందం శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. ఇందుకు ప్రతిగా తన చెరలో ఉన్న 240 మంది బందీల్లో 50 మందిని హమాస్ విడిచిపెట్టనుంది. అటు ఇజ్రాయెల్‌ కూడా తమ వద్ద జైళ్లలో ఉన్న పాలస్తీనా మహిళలు, చిన్నారులను విడుదల చేయనుంది. ఈ ఒప్పందంతో గాజాకు మరింత మానవతా సాయం అందించేందుకు వీలు లభించనుంది. ఈ గ్యాప్ లో గాజాకు అవసరమైన ఇందనాన్ని అందించేందుకు ఈజిప్టు ముందుకు వచ్చిందని సమాచారం.