Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో దారుణం... డెడ్ బాడీ పై డ్యాన్స్!

హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఓ దారుణం వెలుగుచూసింది. ఓ యువకుడు అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడని అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 April 2025 1:17 PM IST
హైదరాబాద్ లో దారుణం... డెడ్ బాడీ పై డ్యాన్స్!
X

చాలా మంది మనుషుల్లో మానవత్వం పాళ్లు రోజు రోజుకీ తగ్గిపోయి రాక్షసత్వం తాలూకు లక్షణాలు పెరిగిపోతున్నాయనే చర్చ ఇటీవల బలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే! పైగా మనిషిని చంపడం అనేది అత్యంత సాధారణ విషయంలో మారిపోయినట్లుగా ఇటీవల వెలుగు చూస్తోన్న పలు ఘటనలు చెబుతున్న పరిస్థితి! ఈ సమయంలో హైదరాబాద్ లో ఓ దారుణం వెలుగుచూసింది.

అవును... హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఓ దారుణం వెలుగుచూసింది. ఓ యువకుడు అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇందులో భాగంగా.. ఓ వృద్ధురాలిని చంపి, అనంతరం ఆమె మృతదేహంపై చిందులేశాడు! ఆ సమయంలో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియోను మిత్రులందరికీ షేర్ చేశాడు. అనంతరం రాష్ట్రం విడిచి పారిపోయినట్లు చెబుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ కుషాయిగుడాలో కమలాదేవి (70) అనే వృద్ధురాలు నివాసం ఉంటోంది. ఆమెకు చెందిన షాపును ఓ యువకుడికి అద్దెకు ఇచ్చింది! ఈ క్రమంలో ఇటీవల రెంటు విషయంలో సదరు యువకుడిని వృద్ధురాలు మందలించినట్లు చెబుతున్నారు. దీంతో.. ఆమెపై కక్ష పెంచుకున్న యువకుడు.. ఆమెను కడతేర్చాలని భావించాడు! సరైన సమయం కోసం ఎదురుచూశాడు!

ఈ క్రమంలో ఈ నెల 11న ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసిన యువకుడు, ఆమెను ఉరివేసి హత్య చేశాడని తెలుస్తోంది! అనంతరం ఆమె ఇంటికి తాళం వేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు.

మరోవైపు.. మృతదేహంపై డ్యాన్స్ చేస్తున్న నిందితుడి వీడియో మిత్రులకు పంపించగా.. అది బెంగళూరు ప్రాంతంలో వైరల్ అయినట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. దీంతో.. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు! ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.