ఊహించని మలుపు... 'హర్మూజ్' విషయంలో ఇరాన్ షాకింగ్ వ్యాఖ్యలు!
అవును... గతంలో ఈ జలసంధిని ఇరాన్ ఎప్పుడూ మూయలేదనే చెప్పాలి. ఇరాన్ – ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఈ జలసంధి తెరిచే ఉంది.
By: Tupaki Desk | 18 Jun 2025 12:17 PM ISTఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ.. అంతర్జాతీయ సమాజానికి ఉమ్మడిగా ఒకటే టెన్షన్. అదే... హార్మూజ్ జలసంధి! వాస్తవానికి మహా మహా యుద్ధాలు జరిగినప్పుడే ఈ జలసంధిని మూయలేదు కదా అనే చిన్న హోప్ మరో వైపు. అయితే.. ఈ జలసంధిని అడ్డుపెట్టుకుని అంతర్జాతీయ సమాజాన్ని ఇరాన్ బ్లాక్ మెయిల్ చేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... గతంలో ఈ జలసంధిని ఇరాన్ ఎప్పుడూ మూయలేదనే చెప్పాలి. ఇరాన్ – ఇరాక్ యుద్ధ సమయంలో కూడా ఈ జలసంధి తెరిచే ఉంది. మరోవైపు.. ఆ దేశం ఉత్పత్తి చేసే చమురులో సుమారు 80% చైనా కొనుగోలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని మూస్తే.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింటుంది. అయినప్పటికీ ఈ జలసంధిని మూసేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది.
ఇలా చమురు వ్యాపారానికి జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిని మూసివేస్తానని ఇరాన్ బెదిరింపులకు దిగుతుండటంతో.. అంతర్జాతీయ సమాజంలో ఆందోళనలు నెలకొన్నాయి. కేవలం సుమారు 30 కిలోమీటర్ల వెడల్పున్న ఈ ఇరుకైన జలసంధి నుంచే ప్రపంచం వాడే చమురులో ఐదో వంతు రవాణా అవుతుంది. ద్రవరూప సహజవాయువు (ఎల్.ఎన్.జీ) రవాణాకు కూడా ఈ జలమార్గం అత్యంత కీలకం!
ఈ మార్గం ద్వారా సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, కువైట్, ఇరాక్ ల నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు రవాణా అవుతోంది. ఇలా చమురు రవాణా విషయంలో అత్యంత కీలకంగా ఉన్న ఈ జలసంధిని ఇప్పుడు మూసేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అంటున్నారు.
అయితే.. అమెరికాను, ఇజ్రాయెల్ ను ఆపే విషయంలో గల్ఫ్ కంట్రీస్తో పాటు హర్మూజ్ జలసంధిపై ఆధారపడిన దేశాల జోక్యం కోసమే ఇరాన్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతోందా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తుందనేది మాత్రం వాస్తవం!
ఇక ప్రధానంగా భారత్ విషయానికొస్తే... మనదేశం వినియోగించే ఇంధనంలో 90% వివిధ మార్కెట్ల నుంచే దిగుమతి చేసుకొంటుండగా.. చమురులో 40% ఈ ఒక్క మార్గం నుంచే రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఆ జలసంధి మార్గం మూసుకుపోతే.. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవడంతోపాటు.. రవాణా, బీమా ఖర్చులు పెరుగుతాయని అంటున్నారు.
ఈ మార్గం నుంచి వచ్చే చమురు, ఎల్.ఎన్.జీ అత్యధికంగా దిగుమతి చేసుకునే భారత్ తో పాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్ లకు ఈ సమస్యలు ఉంటాయని చెబుతున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే... ఈ జలసంధిని మూసేస్తే మిగిలిన దేశాలతో పాటు ఇరాన్ కు భారీ దెబ్బ అని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అది పెద్ద దెబ్బ అని అంటున్నారు.
