ప్రపంచ దేశాలకు బిగ్ బ్రేకింగ్... ఇరాన్ నుంచి షాకింగ్ ప్రకటన!
అవును... ఇరాన్ లోని అణు కేంద్రాలపై అమెరికన్ యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయని ట్రంప్ ధృవీకరించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jun 2025 11:31 PM ISTఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధంతో ఇప్పటికే పశ్చిమాసియా రగిలిపోతున్న వేళ.. తాజాగా అమెరికా దాడులతో వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చిందని అంటున్నారు. ఈ సమయంలో గతంలో కంటే తీవ్రంగా ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతోంది. మరోవైపు అమెరికాతో చర్చలకు ఇరాన్ ప్రస్తుతానికి ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఓ షాకింగ్ ప్రకటన వెలువడింది!
అవును... ఇరాన్ లోని అణు కేంద్రాలపై అమెరికన్ యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయని ట్రంప్ ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఈ కన్ఫర్మేషన్ అనంతరం కొన్ని గంటల తర్వాత.. ఐ.ఆర్.జీ.సీ. నేవీ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలిరేజా టాంగ్సిరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగా.. "హార్ముజ్ జలసంధి కొన్ని గంటల్లోనే మూసివేయబడుతుంది" హెచ్చరిక జారీ చేశారు.
దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీంతో.. ఇది ప్రపంచ దేశాలకు అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ అని అంటున్నారు. ప్రధానంగా ఈ జలసంధి ద్వారా చమురు వాణిజ్యంతో ముడిపడిన ప్రతీ దేశానికి ఇది బిగ్ న్యూస్ అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్రూడాయిల్ బ్యారెల్ ధరలు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పేరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఫలితంగా పెట్రోల్ ధరలు పెరగొచ్చని చెబుతున్నారు.
కాగా... అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడిగా ఉన్న ఈ హార్మూజ్ జలసంధి.. భారత్ చమురు దిగుమతులకూ అత్యంత ముఖ్యమైనదే! తాజా పరిణామాల వేళ దీన్ని మూసివేస్తే.. ఆ ప్రభావం దిగుమతులపై ఏమేర ప్రభావం చూపనుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి భారత్ నిత్యం 5.5 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం దిగుమతి చేసుకుంటున్నట్లు అంచనా. ఇందులో 2 మిలియన్లు ఈ జలసంధి నుంచే సరఫరా అవుతుంది.
అయితే... ఈ హార్మూజ్ జలసంధిని ఇప్పటికిప్పుడు ఇరాన్ మూసివేసినప్పటికీ.. భారత దిగుమతులపై మరీ తీవ్ర ప్రభావం అయితే ఉండకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే.. భారత్ దిగుమతులు కేవలం పశ్చిమాసియా నుంచే కాకుండా రష్యా, అమెరికా, బ్రెజిల్ ల నుంచి ఎక్కువగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ధరలు మాత్రం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
కేవలం 30 కిలోమీటర్ల వెడల్పున్న ఈ ఇరుకైన జలసంధి నుంచే ప్రపంచం వాడే చమురులో ఐదో వంతు రవాణా అవుతుంది. ద్రవరూప సహజవాయువు (ఎల్.ఎన్.జీ) రవాణాకు కూడా ఈ జలమార్గం అత్యంత కీలకం! ఈ మార్గం ద్వారా సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, కువైట్, ఇరాక్ ల నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు రవాణా అవుతోంది.
ఇలా చమురు రవాణా విషయంలో అత్యంత కీలకంగా ఉన్న ఈ జలసంధిని ఇప్పుడు మూసేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆందోళన నెలకొందని అంటున్నారు. మరి.. ఇరాన్ తన నిర్ణయాన్ని అమలు చేసిన తర్వాత పరిణామాలు ఏ విధంగా మారతాయనేది వేచి చూడాలి!
