చిత్తూరులో పరువు హత్య.. నాన్నకు బాగోలేదని తీసుకెళ్లి చంపేశారు
చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న పరువు హత్య ఇప్పుడు సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 15 April 2025 10:40 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న పరువు హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. తన భార్యను పుట్టింటి వారికి అప్పగించిన గంటల వ్యవధిలోనే ఆమె మరణించి.. మార్చురీలో శవంగా మారిన వైనం అందరిని కలిచివేస్తోంది. ఆదివారం జరిగిన ఘటన.. కాస్త ఆలస్యంగా సోమవారం వెలుగు చూసింది.
చిత్తూరు నగరంలోని బాలాజీ నగర్ కు చెందిన షౌకత్ అలీ.. ముంతాజ్ ల కుమార్తె 26 ఏళ్ల యాస్మిన్ బాను. ఆమె ఎంబీఏ పూర్తి చేసింది. ఇదిలా ఉండగా జిల్లాలోని పూతలపట్టు మండలానికి చెందిన సాయితేజ్ బీటెక్ చదివాడు. కాలేజీ రోజుల్లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. వీరి పెళ్లికి యాస్మిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎస్సీ వర్గానికిచెందిన సాయితేజ్ తో పెళ్లికి నో చెప్పేశారు.
దీంతో.. వీరిద్దరూ ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. తమకు ప్రాణహాని ఉంటుందన్న భయంతో వీరు ఫిబ్రవరి 13న తిరుపతి డీఎస్పీని ఆశ్రయించారు. ఇరువురు కుటుంబాలను పిలిచిన పోలీసులు.. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పంపారు. రెండు నెలలుగా వీరి సంసారం సాఫీగా సాగుతోంది. కొద్దిరోజులుగా యాస్మిన్ కుటుంబీకులు ఫోన్ లో మాటలు కలిపారు.
ఆమె తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం సరిగా లేదని..ఒకసారి వచ్చి చూసి వెళ్లాలని కోరారు. పదే పదే పుట్టింటి నుంచి కబురు రావటంతో.. భర్తను అడిగింది. చివరకు ఆదివారం ఉదయం సాయితేజ.. తన భార్యను చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలి వద్ద అమె సోదరుడి కారులో ఎక్కించి.. ఆమె తల్లిగారింటికి పంపాడు. కాసేపటి తర్వాత భార్యకు ఫోన్ చేశాడు. ఫోన పని చేయట్లేదు. వారి ఇంట్లో వారికి ఫోన్ చేసినా కలవకపోవటంతో నేరుగా వారింటికి వెళ్లాడు.
యాస్మిన్ ఇంట్లో లేదని.. ఆత్మహత్య చేసుకోవటంతో గవర్నమెంట్ ఆసుపత్రి మార్చురీలో ఉందని ఆమె కుటుంబ సభ్యలు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో షాక్ తిన్న సాయి తేజ.. ఆసుపత్రికి వెళ్లగా మార్చురీలో.. భార్య శవాన్ని చూసి భోరుమన్నాడు. మతాలు.. కులాలు వేరు కావటంతో తమ పెళ్లిని యాస్మిన్ తల్లిదండ్రులు వ్యతిరేకించినట్లుగా వాపోయాడు. చివరకు తన భార్యను చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు యాస్మిన్ తండ్రి.. ఆమె పెద్దమ్మ కొడుకులు పరారైనట్లుగా పోలీసులు గుర్తించారు. వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. యాస్మిన్ ది అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఉదంతం స్థానికంగా పెను సంచలనంగా మారింది.
