Begin typing your search above and press return to search.

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు గౌరవ డాక్టరేట్

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేశారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 5:17 AM GMT
క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు గౌరవ డాక్టరేట్
X

క్యాసినో కింగ్ గా పేరు. హైలెవల్ పరిచయాలు. విచిత్రమైన అభిరుచులు. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే తీరు. అనూహ్య రీతిలో తరచూ ఏదో ఒక వివాదంలో పేరు వినిపిస్తూ.. వార్తల్లో నిలిచే చికోటీ ప్రవీణ్ తాజాగా గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టరేట్ ను అందించారు. ఇంతకూ ఆయనకు ఏ విభాగంలో డాక్టరేట్ అందిందన్న విషయంలోకి వెళితే.. జూఫిలిస్ట్.. ఎన్విరాన్మెంటలిస్ట్ గా గుర్తిస్తూ ఆయనకు ఈ గౌరవ డాక్టరేట్ ను అందించారు.

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. తనను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇవ్వటంపై ప్రవీణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రవీణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంచభూతాల్ని రక్షిస్తే.. అవి మనల్ని రక్షిస్తాయన్న ఆయన.. ప్రపంచంలో మనుషులకు జీవించే హక్కు ఎంత ఉందో.. జంతువులు.. పక్షులకు కూడా అంతే హక్కు ఉందన్నారు.

తనకు పర్యావరణం మీదా.. మూగజీవాల మీద ఉన్న ప్రేమను ప్రస్తావిస్తూ.. జంతువులు.. పక్షులులేని ప్రపంచంలో మనుషులు జీవించలేరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే తనకు జంతువులు.. పక్షులంటే అమితమైన ఇష్టమని చెప్పిన ఆయన.. ఈ కారణంతోనే అరుదైన జీవజాతుల్ని తన కన్నబిడ్డల్లా పెంచుతానని పేర్కొన్నారు. చికోటి ప్రవీణ్ ఫాంహౌస్ లో అరుదైన జంతుజాలం ఉండటం.. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు వైరల్ కావటం.. అటవీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి.. అన్నింటికి తగిన అనుమతులు తీసుకున్నారని చెప్పటం తెలిసిందే. ఎంతోమంది ప్రముఖులు ఆయన కలెక్షన్ గా సేకరించిన అరుదైన జీవజాతుల్ని చూడటానికి ఆయన ఫాంహౌస్ కు వెళ్లటం తెలిసిందే.