హనీమూన్ మర్డర్ కేసులో దారుణ నిజాలు: రఘువంశీ హత్య తర్వాత మరో మహిళ మర్డర్ ప్లాన్
"హనీమూన్ మర్డర్" కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది.
By: Tupaki Desk | 13 Jun 2025 12:30 PM"హనీమూన్ మర్డర్" కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. రాజా రఘువంశీని హత్య చేసేందుకు అతడి భార్య సోనమ్, ఆమె నియమించిన హంతకులు మూడు సార్లు విఫలయత్నం చేశారని, నాలుగో ప్రయత్నంలో హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సియామ్ స్వయంగా విలేకరులకు తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, రాజా రఘువంశీని హత్య చేసేందుకు హంతకులు మొదటిసారి గువాహటీలో ప్రయత్నించారు. ఆ తర్వాత రెండుసార్లు మేఘాలయలోని సోహ్రాలో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కానీ ఆ తర్వాత వెయిసావ్‌డోంగ్ జలపాతం వద్ద రఘువంశీపై దాడి చేసి హత్య చేశారు.
"వారు తొలుత రఘువంశీపై చాలాసార్లు దాడికి యత్నించారు. తొలుత గువాహటిలోనే చంపి అతడి శరీరాన్ని పారేయాలనుకున్నారు. కానీ, ఆ ప్లాన్ వాయిదా పడింది. ఆ తర్వాత నంగ్రిట్ వద్ద అనుకున్నా.. బాడీని పారేసేందుకు అనువైన ప్రదేశం లేకపోవడంతో ప్లాన్ వాయిదా వేశారు" అని ఎస్పీ సియామ్ తెలిపారు. "మవ్లాఖియట్, వెయిసావ్‌డోంగ్ వద్ద కూడా యత్నించారు. అక్కడ రఘువంశీ వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు చంపాలనుకున్నా సాధ్యం కాలేదు. చివరికి వెయిసావ్‌డోంగ్ జలపాతం వద్ద హత్య చేశారు."
సోనమ్-రఘువంశీ పెళ్లి తర్వాత గువాహటీలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో పూజలు చేయడం కోసం వచ్చారు. హంతకులు మే 19వ తేదీనే అక్కడికి చేరుకొన్నారు. అక్కడినుంచి సోనమ్ షిల్లాంగ్, సోహ్రా వెళ్లాలని ప్లాన్ చేసింది. దీంతో అక్కడ హంతకులు ప్లాన్‌ను రద్దు చేసుకున్నారని ఎస్పీ వెల్లడించారు.
-హత్య కుట్రలోని దారుణ వివరాలు
రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనమ్‌తో వివాహం జరగ్గా.. మే 20న హనీమూన్ కోసం ఈ నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత కనబడకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. అనంతరం సోనమ్ కోసం గాలించగా.. ఉన్నట్టుండి ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌లో ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు అధికారులు గుర్తించారు.
-మరో మహిళను హత్య చేసేందుకు ప్లాన్.. సంచలనం రేపుతున్న సోనమ్ కేసు!
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీని అత్యంత దారుణంగా హత్య చేయించింది భార్య సోనమ్ రఘువంశీ. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి, ఈ దారుణానికి తెగబడింది. ముగ్గురు కిరాయి హంతకులతో మేఘాలయలోని ఖాసీ హిల్స్‌లో రాజాను మర్డర్ చేశారు. మే 23న రాజా హత్య జరిగితే, జూన్ 02న పోలీసులకు అతడి మృతదేహం లభ్యమైంది. చివరకు, జూన్ 08న నిందితురాలు సోనమ్ యూపీలోని ఘాజీపూర్ పోలీసుల ముందు లొంగిపోయింది.
అయితే, ఇప్పుడు నిందితులందరినీ మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత, మరో మహిళను కూడా హత్య చేయాలని నిందితులు ప్లాన్ చేసినట్లు తేలింది. సోనమ్ కూడా చనిపోయిందని నమ్మించాలనే ప్రయత్నంలో మహిళను హత్య చేయాలని భావించారు.
రాజాను చంపడానికి కుట్ర ఇండోర్‌లో జరిగింది. మే 11న సోనమ్‌తో అతడి వివాహం జరిగింది. దీనికి ముందే హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి సోనమ్ లవర్ రాజ్. ఈ కుట్రకు సోనమ్ అంగీకరించిందని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ సయీమ్ చెప్పారు. హత్య తర్వాత బుర్ఖా ధరించి సోనమ్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ హత్యకు పాల్పడిన కాంట్రాక్ట్ కిల్లర్స్ విశాల్, ఆకాష్, ఆనంద్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
మేలో వీరిద్దరి వివాహం జరిగితే ఫిబ్రవరి నుంచే హత్యకు ప్లాన్ చేశారు. ఒక పథకం ప్రకారం, సోనమ్ నదిలో కొట్టుకుపోతున్నట్లు ప్రజల్ని నమ్మించడం, మరొక పథకం ప్రకారం, ఎవరైనా మహిళను హత్య చేసి మృతదేహాన్ని తగులబెట్టడం వంటివి ప్లాన్ చేశారు. ముందుగా మేఘాలయలో కాకుండా, గౌహతిలోనే రాజాను హత్య చేయాలని ప్లాన్ చేశారు.