Begin typing your search above and press return to search.

ఆటో రిక్షాకు హోర్డింగ్.. పెళ్లి కోసం అతగాడి తిప్పలు ఎంతంటే?

ఈ ఎపిసోడ్ లో పెళ్లి కొడుకు తాను నడిపే ఆటో రిక్షా కు ‘వధువు కావలెను’ అన్న హోర్డింగ్ పెట్టుకొని మరీ తిరుగుతున్నాడు. అయినా ఫలితం దక్కని పరిస్థితి.

By:  Tupaki Desk   |   19 Feb 2024 4:00 AM GMT
ఆటో రిక్షాకు హోర్డింగ్.. పెళ్లి కోసం అతగాడి తిప్పలు ఎంతంటే?
X

కాలం మారింది. అభిరుచులు మారుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా అమ్మాయి పుడితే ఇంటికి భారం అన్న మైండ్ సెట్ కారణంగా అమ్మాయిల సంఖ్య కొన్నిచోట్ల తగ్గింది. గతంలో మాదిరి పెళ్లి అన్నంతనే అమ్మాయిలు దొరకని పరిస్థితి. ఒకవేళ ఉన్నా.. వారి ఆలోచనలు.. ఆశలకు పెళ్లి కొడుకులు కళ్లు తేలేస్తున్న పరిస్థితి. దీంతో పెళ్లి కోసం ముఖం వాచేటట్లుగా తిరుగుతున్న ఉదంతాలు బోలెడు. ఇప్పుడు ఆ కోవకు చెందిన ఉదంతమే. కాకుంటే.. ఈ ఎపిసోడ్ లో పెళ్లి కొడుకు తాను నడిపే ఆటో రిక్షా కు ‘వధువు కావలెను’ అన్న హోర్డింగ్ పెట్టుకొని మరీ తిరుగుతున్నాడు. అయినా ఫలితం దక్కని పరిస్థితి.

మధ్యప్రదేశ్ లోని దమోహ్ పట్టణానికి చెందిన 29 ఏళ్ల దీపేంద్ర రాఠోడ్ ఈ-ఆటో రిక్షా ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వయసు మీద పడుతున్నా పెళ్లి చేసుకోవటానికి అమ్మాయి దొరకట్లేదు. పెళ్లి కాని ప్రసాద్ మాదిరి మనోడి కష్టాలు అన్ని ఇన్ని కావు. తన పెళ్లి విషయంలో తన తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదని.. వారు లేచింది మొదలు పడుకునే వరకు పూజలు పునస్కారాలతో బిజీగా ఉంటారని.. తనకేమో పెళ్లీడు దాటిపోతుందని వాపోతుంటాడు.

అందుకే తనకు తానే ప్రయత్నాలు షురూ చేశాడు. తాను నడిపే ఆటోకు ఒక పెద్ద హోర్డింగ్ కట్టేశాడు. అందులో తన ఫోటోతో పాటు తన వివరాలున్న బయోడేటాను ఫ్లెక్సీ మాదిరి కట్టేశాడు. తన పుట్టిన తేదీ.. ఎత్తు.. బ్లడ్ గ్రూప్.. విద్యార్హత.. గోత్రం లాంటి అన్ని వివరాల్ని అందులో పేర్కొన్నాడు. తనకు కులం.. మతం పట్టింపుల్లేవని.. స్థానికులైనా.. స్థానికేతరులైనా తనకు సంబంధం లేదని చెబుతున్నాడు. ఆటోకు హోర్డింగ్ కట్టుకొని పట్టణమంతా తిరుగుతున్నా ఫలితం రావట్లేదని వాపోతున్నాడు. గతంలో తానో మ్యారేజ్ బ్రోకరేజ్ సంస్థను సంప్రదించానని.. ఫలితం లేకపోవటంతో తనకు తానే సొంతంగా ఇలా ప్రయత్నిస్తున్నాడు. అతగాడి తిప్పలు అన్ని ఇన్నీ కావని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈరిక్షాతో బతికే తాను.. తనను పెళ్లి చేసుకునే అమ్మాయిని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటానని హామీ ఇస్తున్నాడు. మరి.. దీపేంద్ర పెళ్లి ఎప్పటికి అయ్యోనో చూడాలి.