Begin typing your search above and press return to search.

బాలక్రిష్ణ లీలలు.. పెద్ద చేపకు ఉచ్చు బిగుస్తుందా?

ఎంపిక చేసిన బడా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే విషయంలో అనుసరించిన విధానాలు ఏ రీతిలో ఉన్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 9:30 AM GMT
బాలక్రిష్ణ లీలలు.. పెద్ద చేపకు ఉచ్చు బిగుస్తుందా?
X

తుపాను ముందు ప్రశాంత వాతావరణంలా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు గులాబీ కోటలో తరచూ ఉలిక్కిపడేలా చేస్తుందంటున్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. హెచ్ఎండీఏలో కీలకభూమిక పోషించిన శివబాలక్రిష్ణ వ్యవహారం ఇప్పుడు కొత్త ప్రకంపనలకు కారణమవుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. గడిచిన మూడేళ్లలో కీలక ఫైళ్లకు సంబంధించి తాజాగా స్కానింగ్ మొదలైంది.

ఎంపిక చేసిన బడా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే విషయంలో అనుసరించిన విధానాలు ఏ రీతిలో ఉన్నాయి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇందులో భాగంగా కొందరు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులతో కూడిన టీం 2021, 2022, 2023లలో పలు పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన విధానాన్ని వివరించాలని చెప్పటంతో పాటు.. సదరు అనుమతులకు సంబంధించిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో కొన్ని లోపాల్ని ఎత్తి చూపగా.. వాటికి సంబంధించి వస్తున్న వివరణలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. కారణం.. తమకు నాటి మంత్రి నుంచి ఫోన్ వచ్చిందని.. ఆ కారణంగానే పలు ఫైళ్లలో మార్పులు చేర్పులు చేసి అనుమతులు ఇచ్చినట్లుగా పేర్కొనటం ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది. ఉద్యోగులు చెబుతున్న అంశాల్ని వాంగ్మూలంగా తీసుకుంటే కొత్త సంచలనాలు ఖాయమంటున్నారు.

ప్రస్తుతానికి మాత్రం హెచ్ఎండీఏలో ఇచ్చిన అనుమతులకు సంబంధించి అసలేం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దానికి సమాధానం వెతికే క్రమంలో వస్తున్న సమాచారం గులాబీ కోటలో కొత్త కంపనలకు కారణమవుతుందని చెబుతున్నారు. శివబాలక్రిష్ణ ఇచ్చిన అనుమతులకు సంబంధించి భారీ ఎత్తున చేతులు మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్లుగా గుర్తించటం.. శివబాలక్రిష్ణను రిమాండ్ చేయటంతో పాటు.. తాజాగా ఆయన సోదరుడ్ని సైతం అరెస్టు చేయటం తెలిసిందే.

తాజాగా జరుపుతున్న విచారణలో వస్తున్న విషయాలు ఆయన లీలలు ఏ స్థాయిలో ఉండేవన్న విషయం బయటకు వస్తోంది. 2023 జూలై 12న రాష్ట్ర ప్రభుత్వం శివబాలక్రిష్ణను హెచ్ఎండీఏ నుంచి బదిలీ చేసింది. రెరా కార్యదర్శిగా.. మెట్రో సీజీఎంగా నియమించినప్పటికీ.. ఆయన మాత్రం హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ అధికారులతో టచ్ లో ఉండేవారని గుర్తించారు. అంతేకాదు.. మంత్రుల పేరుతో బెదిరింపులకు దిగి.. తనకు అవసరమైన పత్రాలు.. దస్త్రాలను తెప్పించుకొని పాత తేదీలతో అనుమతులు ఇచ్చినట్లుగా ప్రక్రియ పూర్తి చేసేవారని చెబుతున్నారు.

పలు బహుళ అంతస్తులకు సంబందించి డ్రాఫ్టు.. ఫైనల్ లేఅవుట్లను కూడా జారీ చేసినట్లుగా చెబుతున్నారు. తాజాగా చేస్తున్న వెరిఫికేషన్ సందర్భంగా శివబాలక్రిష్ణ నుంచి తమకు మెసేజ్ లు వచ్చేవని.. వాటి ఆధారంగా తాము పనులు చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని పలువురు ఉద్యోగులు చెప్పటమే కాదు.. తమ ఫోన్లలో ఆ మెసేజ్ లను చూపిస్తుండటం గమనార్హం. ఇదంతా చూస్తే.. రానున్న రోజుల్లో శివ బాలక్రిష్ణ కారణంగా గులాబీ కోటలోని కీలక వ్యక్తులకు కొత్త సమస్యలు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.