Begin typing your search above and press return to search.

ఎవరా ఢిల్లీ వ్యక్తి? స్విగ్గీకి అతడి ఆర్డర్ అక్షరాల రూ.12 లక్షలు!

ఈ భారీ ఆర్డర్ మీద అతను దగ్గర దగ్గర రూ.1.70లక్షల వరకు ఆదా చేసినట్లుగా తెలిపింది.

By:  Tupaki Desk   |   21 Dec 2023 9:30 AM GMT
ఎవరా ఢిల్లీ వ్యక్తి? స్విగ్గీకి అతడి ఆర్డర్ అక్షరాల రూ.12 లక్షలు!
X

ఏడాది మొత్తంలో తన యాప్ లో చోటు చేసుకున్న కార్యకలాపాలకు సంబంధించిన వివరాల్ని వార్షిక రిపోర్టు రూపంలో విడుల చేస్తుంటుంది స్విగ్గీ. మొన్నటికి మొన్న ఫుడ్ ఆర్డర్ కు సంబంధించిన రిపోర్టును విడుదల చేసిన ఈ సంస్థ.. తాజాగా తన స్విగ్గీ ఇన్ స్టాలో గ్రోసరీకి సంబంధించిన డెలివరీల వివరాల్ని వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ఏడాది మొత్తంలో ఏకంగా రూ.12లక్షల విలువైన గ్రోసరీ సామాన్లను తమ యాప్ ద్వారా కొనుగోలు చేసిన విషయాన్ని వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఢిల్లీకి చెందిన సదరు వ్యక్తి ఏడాది వ్యవధిలో పెట్టిన ఖర్చు రూ.12,87,920గా పేర్కొంది. ఈ భారీ ఆర్డర్ మీద అతను దగ్గర దగ్గర రూ.1.70లక్షల వరకు ఆదా చేసినట్లుగా తెలిపింది.

జైపూర్ కు చెందిన ఒక వ్యక్తి ఒకే రోజు 67 ఆర్డర్లు ఇచ్చారని తెలిపింది. అదే సమయంలో ఢిల్లీకి చెందిన ఒకరు ఇచ్చిన ఆర్డర్ లో ఏకంగా 99 వస్తువులు ఉన్నట్లుగా తెలిపింది. ఇందులో ఎక్కువగా చిప్స్.. చాక్లెట్లు.. కుకీలు.. కాఫీ.. జ్యూస్.. నాచోస్.. చిప్స్ కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. ఒకే వ్యక్తి ఒకే రోజులో ఒకే ఆర్డర్ రూపంలో అతి పెద్ద బిల్లు చెన్నైకు చెందిన వ్యక్తిగా పేర్కొంది. అతగాడి ఒక్క బిల్లు విలువ రూ.31,748గా స్విగ్గీ తన నివేదికలో వెల్లడించింది.

స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ లో వినియోగదారులు ఎక్కువగా ఆర్డర్ చేసే వస్తువుల గురించి చెబుతూ.. ఉల్లిపాయలు.. టొమాటో.. కొత్తిమీర ఆకులుగా పేర్కొంది. అదే సమయంలో తమ యాప్ లో ఎక్కువగా వెతికే వస్తువుల జాబితాలో పాలు.. పెరుగు.. ఉల్లిపాయలు ఉన్నట్లుగా తెలిపింది. ఇక.. అందరూ ఇష్టంగా తినే మామిడి పండ్ల గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. దేశంలోనే అతి ఎక్కువ మామిడి ప్రియులు బెంగళూరులో ఉన్నట్లుగా తెలిపింది.

తమ వద్ద మామిడిపండ్లను ఆర్డర్ చేసిన నగరాల జాబితాలో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. ముంబయి.. హైదరాబాద్ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక.. సెప్టెంబరులో అత్యధిక సంఖ్యలో కండోమ్ ఆర్డర్లు వచ్చినట్లుగా పేర్కొంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కండోమ్ లు ఆర్డర్లు ఇచ్చిన వాటితో పాటు ఆర్డర్ చేసిన వస్తువుల్ని చూస్తే.. కండోమ్ లు.. ఉల్లిపాయలు.. చిప్స్.. అరటిపండ్లుగా ఉన్నాయని వెల్లడించింది. ఈ ఏడాది మొత్తంలో అత్యంత వేగంగా ఆర్డర్ ను డెలివరీ చేసిన రికార్డు.. ఢిల్లీకి చెందిన ఇన్ స్టెంట్ నూడుల్స్ పాకెట్ ను 65 సెకన్ల వ్యవధిలో డెలివరీ చేసినట్లుగా స్విగ్గీ వెల్లడించింది.