Begin typing your search above and press return to search.

బాలయ్య హిందూపురానికి బాబు చెప్పిన గుడ్ న్యూస్

హిందూపురం నుంచి మూడు సార్లు నందమూరి బాలకృష్ణ గెలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నారు.

By:  Satya P   |   20 Feb 2026 3:00 PM IST
బాలయ్య హిందూపురానికి బాబు చెప్పిన గుడ్ న్యూస్
X

హిందూపురం నుంచి మూడు సార్లు నందమూరి బాలకృష్ణ గెలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ఆయన తన నియోజకవర్గంలో ప్రతీ సమస్యను తెలుసుకుని దాని పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నారు. తాజాగా రెండు రోజుల పాటు హిందూపురంలో బాలయ్య పర్యటిస్తున్నారు. ఆయన ఈ పర్యటనలో ఉండగానే కూటమి ప్రభుత్వం ఒక తీపి కబురు స్థానిక ఎమ్మెల్యేగా బాలయ్యకు అందించింది. అదేంటి అంటే కొత్తగా హిందూపురం రోడ్లు భవనాలశాఖ పరిధిలో డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వాటితో కలిపి ఏర్పాటు :

కొత్తగా హిందూపురంలో ఏర్పాటు అయిన ఆర్ అండ్ బీ డివిజన్ లోకి పెనుకొండ, మడకశిర సబ్‌డివిజన్లను కలిపారు. దీంతో ఆ శాఖలో మరింతగా అభివృద్ధి జరుగుతుంది. స్థానికంగానే పాలనా వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు వేగంగా తీసుకుని అమలు చేసే అవకాశాలు ఉంటాయి. ఈ డిమాండ్ చాలా కాలంగా ఉంది. దాంతో కూటమి ప్రభుత్వం హిందూపురం విషయంలో ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ధర్మవరం డివిజన్‌లో ఏకంగా రెండు వేల 500 దాకా కిలోమీటర్ల పరిధిలో ధర్మవరంతో పాటు కదిరి, పెనుకొండ, మడకశిర సబ్‌ డివిజన్లు ఉంటూ వచ్చాయి.

అయితే సుదీర్ఘమైన దూరంతో పాలనాపరమైన సమస్యలు ఉత్పన్నం కావడంతో అందులోని సబ్ డివిజన్లను మారుస్తూ పైగా హిందూపురాన్ని కొత్త డివిజన్ చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులతో ధర్మవరం ఆర్ అండ్ బీ డివిజన్‌లోకి కేవలం ధర్మవరం, కదిరి సబ్‌ డివిజన్లు మాత్రమే వస్తాయని అధికారులు చెబుతున్నారు ఇక కొత్తగా తీసుకుని వచ్చిన హిందూపురం ఆర్ అండ్ బీ డివిజన్ ‌లోకి కేవలం వేయి 336 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉండే పెనుకొండ, మడకశిర సబ్‌డివిజన్లు చేరిపోయాయి. దీని వల్ల అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది అని అంటున్నారు . ఇక హిందూపురాన్ని ఆర్ అండ్ బీ కొత్త డివిజన్ చేయడంతో ఇప్పటిదాకా కొనసాగిన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం డివిజన్‌ ని పూర్తిగా రద్దు చేశారు. పైగా కళ్యాణదుర్గాన్ని తెచ్చి అనంతపురం డివిజన్‌కు కలిపారు.

నియోజకవర్గం కేంద్రంలోనే :

ఇక కొత్తగా నెలకొల్పిన హిందూపురం ఆర్ అండ్ బీ డివిజన్ కి సిబ్బందిని కూడా ఎటాచ్ చేశారు. కళ్యాణ దుర్గం డివిజన్ లోని సిబ్బందిగా ఉన్న 24 మంది నేరుగా హిందూపురం డివిజన్ కి బదిలీ అయ్యారు. ఇక మీదట వారు అక్కడ నుంచే విధులు నిర్వహిస్తారు. హిందూపురాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని పట్టుదలగా ఉన్న బాలయ్యకు ఇది శుభ పరిణామం అని చెబుతున్నారు. ఆర్ అండ్ బీ రహదారులు నియోజకవర్గంలో ఇక మీదట మరింత పెద్ద ఎత్తున నిర్ణయాలతో పాటు నిర్మాణాలు జరుపుకునేందుకు వీలు ఏర్పడుతుందని అంటున్నారు

బాబు దృష్టిలోకి :

మరో వైపు తన నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలోకి తీసుకుని వెళ్తాను అని బాలయ్య చెబుతున్నారు. స్థానిక పట్టు రైతులకు, రీలర్లకు ప్రోత్సాహక నిధులు పెండింగ్ ఉన్నాయని బాలయ్య చెబుతూ వారికి చెల్లించాల్సిన 80 కోట్ల రూపాయల నిధులను వేగంగా మంజూరు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాను అని హామీ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ఎంతో మేలు జరుగుతోందని చెప్పిన బాలయ్య రాష్ట్రానికే బాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ కితాబు ఇవ్వడం విశేషం.