Begin typing your search above and press return to search.

హిందీ మంట మహారాష్ట్రలో ఈసారి బలంగానే మొదలైంది!

దేశంలో తమ భాష మీద అమితమైన అభిమానం ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు.. మహారాష్ట్రలు అగ్రస్థానంలో ఉంటాయి.

By:  Tupaki Desk   |   22 April 2025 10:17 AM IST
హిందీ మంట మహారాష్ట్రలో ఈసారి బలంగానే మొదలైంది!
X

తెలుగోళ్లను కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈ తరహా భావోద్వేగ అంశాల విషయంలో తెలుగోళ్లు అట్టడుగున ఎక్కడో ఉంటారు. ఎవరు ఎలాపోయినా.. వారి అమ్మభాషను ఎవరూ పట్టించుకోకపోయినా ఎవరికి పట్టదు. ఆ మాటకు వస్తే.. అమ్మభాషను అపురూపంగా చూసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. అదే అన్నింటికి మించిన ఆశ్చర్యం. మన పక్కనే ఉన్న తమిళుల్ని చూసైనా కొంత నేర్చుకోవాల్సి ఉన్నా.. అలాంటి ఆలోచనలు ఎప్పుడూ కలగవు.

దేశంలో తమ భాష మీద అమితమైన అభిమానం ఉన్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు.. మహారాష్ట్రలు అగ్రస్థానంలో ఉంటాయి. వారు తమ ఆస్తిత్వాన్ని తమ అమ్మభాషలో చూసుకుంటారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తమ అమ్మభాష విషయంలో ఎవరైనా వేలు పెడితే వారి సంగతి చూడడటం కనిపిస్తుంది. ఏది ఏమైనా హిందీని అందరికి నేర్పాలన్న సంకల్పం ఇప్పుడు కొత్త తరహా ఆందోళనకు తెర తీస్తోంది. మొన్నటికి మొన్న తమిళనాడులో హిందీ మంటలు ఒక కొలిక్కి రాక ముందే.. ఇప్పుడు మహారాష్ట్రలో హిందీ మంట రాజుకుంది.

హిందీని బలవంతంగా రుద్దే విధానాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొద్దిరోజుల క్రితం ప్రకటించటం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కేంద్రంలోని మోడీ సర్కారు ఉక్కిరిబిక్కిరి అయ్యింది చివరకు స్థానిక భాషతో పాటు.. ఇంగ్లిషు.. మరేదైనా భాష ప్రాథమిక స్థాయిలో తప్పనిసరి చేసే నూతన విద్యా విధానంలో తీసుకొచ్చిన మార్పుల నేపథ్యంలో స్టాలిన్ ఆ తీరును తప్పుపట్టటం తెలిసిందే. దీంతో కేంద్రం ఈ అంశంపై ఒక క్లారిటీ ఇవ్వటం తెలిసిందే.

తాము మూడోభాషగా హిందీయే నేర్పాలని పట్టబట్టటం లేదని.. దేశ భాషల్లో ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోచ్చని చెప్పటంతో అక్కడ రచ్చ ఒక కొలిక్కి వచ్చింది. మహారాష్ట్రలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోందని చెబుతున్నారు. మహారాష్ట్రలో ఇంతవరకు ప్రాథమిక స్థాయిలో మరాఠీ.. ఇంగ్లిషులు మాత్రమే తప్పనిసరిగా ఉన్నాయి. కానీ జాతీయ విద్యావిధానం చెబుతున్న ఏదైనా మరో భాషగా హిందీని ఈ రెండింటితో జత చేసినట్లుగా చెబుతున్న బీజేపీ ప్రభుత్వ వ్యాఖ్యను అక్కడి ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి.

తాము హిందువులమే కానీ హిందీ అవసరం లేదని మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎంఎన్ఎస్) అయితే ముంబయిలో భారీ ఫ్లెక్సీల్ని పెట్టింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరి ఇంకా ఆర్నెల్లు కూడా కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హిందీ భాష తప్పనిసరి అంశం విపక్షాలకు ఆయుధంగా మారింది. అదే సమయంలో మహారాష్ట్రలో ఠాక్రే సోదరుల మధ్య దూరాన్ని తగ్గించేలా మారింది. నిజానికి ఠాక్రే సోదరులు సొంత అన్నదమ్ములు కాదన్న సంగతి తెలిసిందే. కానీ.. వారిద్దరు గతంలో శివసేనలో కలిసి పని చేశారు. 2005లో వారి మధ్య వచ్చిన తేడాల్ని సరిదిద్దేందుకు పార్టీ అధినేత బాల్ ఠాక్రే సైతం రాజీ కోసం ప్రయత్నించినా.. ఫలించలేదు. 2006లో రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ ను స్థాపించారు.

తాను పార్టీ ప్రారంభించిన తొలినాళ్లలో బిహార్ నుంచి వలస వచ్చే వారితో స్థానికుల ఉపాధి దెబ్బ తింటోందని.. వారు దాదాగిరీ చలాయిస్తున్నారంటూ ఆరోపిస్తూ చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారటం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలోని షాపుల బోర్డులన్నీ మరాఠిలో ఉండాలని సాగించిన ఉద్యమంతో పాటు మరాఠీల ఆత్మగౌరవం పేరుతో నిర్వహించిన చాలా ఉద్యమాలు చేపట్టినా రాజ్ ఠాక్రేకు రాజకీయంగా కలిసిరాలేదు. ఇప్పుడు కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతుందన్న అంశంపై సాగిస్తున్న ఉద్యమానికి స్పందన ఏ స్థాయిలో ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

గతంలో తూర్పు పడమరులుగా ఉన్న ఠాక్రే సోదరులు.. ఇప్పుడు ఒకేలాంటి గళాన్ని వినిపిస్తున్నారు. మరి.. వీరిద్దరు జతగా చేపట్టిన హిందీ వ్యతిరేక గళం బీజేపీ మనుగడకు కొత్త ముప్పుగా మారుతుందా? లేదా?అన్నది కాలం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. హిందీ అమ్మభాషగా లేని రాష్ట్రాల్లో ఇంగ్లిష్ లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాలని చట్టం స్పష్టంగా చెబుతున్నా.. హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలన్నట్లుగా వ్యవహరించటం సరికాదు. రాబోయే రోజుల్లో ఇదెన్ని రాజకీయ మంటలకు తెర తీస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్రలో మొదలైన హిందీ మంట రాబోయే రోజుల్లో మరెన్నో రాజకీయ సంచలనాలకు కారణంగా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు.