Begin typing your search above and press return to search.

హిందూ దేశంగా నేపాల్...!?

కొన్ని శతాబ్దాల క్రితం అఖండ భారత్ లో భాగంగా ఉన్న నేపాల్ తరువాత కాలంలో వలస పాలకుల టైం లో వేరు పడింది.

By:  Tupaki Desk   |   22 Feb 2024 3:29 AM GMT
హిందూ దేశంగా నేపాల్...!?
X

కొన్ని శతాబ్దాల క్రితం అఖండ భారత్ లో భాగంగా ఉన్న నేపాల్ తరువాత కాలంలో వలస పాలకుల టైం లో వేరు పడింది. భారత్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాక భారత్ లో తిరిగి విలీనం అయ్యేందుకు నాటి పాలకులు చూశారు అని చరిత్రలో ప్రచారంలో ఉన్న మాట. అయితే ఎందుకో అది కుదరలేదు. ఇదిలా ఉంటే గత రెండు దశాబ్దాల క్రితం దాకా నేపాల్ హిందూ రాజ్యంగా ఉండేది. ఈ ప్రపంచంలో భారత్ లో హిందువులు పెద్ద ఎత్తున ఉంటారు.

ఆ తరువాత ప్లేస్ నేపాల్ దే. ఈ రెండు దేశాలలోనే హిందువులు తమ ఉనికి చాటుకునేవారు. అలాంటి నేపాల్ లో మార్పులు 2008లో సంభవించాయి. అప్పట్లో నేపాల్ హిందూ దేశం నుంచి మారిపోయింది, భారత్ మాదిరిగా లౌకిక రాజ్యంగా మార్పు చేశారు. దానికి కారణం మావోయిస్టులు వామపక్ష ఉద్యమకారులు.

మావోలు ఉద్యమ బాటను వీడి జన జీవన స్రన్వతిలో కలిశాక వారు రాజకీయాల్లో ప్రవేశించారు. దాంతో హిందూ దేశంగా ఉన్న నేపాల్ లో కూడా మార్పులు వచ్చాయి. మావోలు వామపక్ష భావజాలం ఉన్న వారు అధికారంలో రావడంతోనే భారత్ వ్యతిరేక వైఖరిని కూడా అనుసరించడం మొదలైంది అని ప్రచారంలో ఉంది.

అలాగే చైనాకు సన్నిహితంగా నేపాల్ మెలగడం కూడా మావోలు వామపక్ష భావాలు ఉన్న పాలకులు అధికారం చలాయించడమే అని అంటున్నారు. ఇది జరిగి దాదాపుగా రెండు దశాబ్దాల కాలం తరువాత నేపాల్ తిరిగి తన పూర్వ రూపాన్ని సంతరించుకోవాలని ఉద్యమం రేగుతోంది.

పైగా నేపాల్ భారత్ తో తన బంధాలు బలపరచుకోవాలని స్థానిక ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. ఈ నేపధ్యంలోనే నుంచి చూసినపుడు నేపాల్‌ను హిందూ దేశంగా ప్రకటించాలన్న డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. వైదిక్ సనాతన్ హిందూ దేశంగా నేపాల్‌ను ప్రకటించాలని జనం నుంచి వచ్చిన డిమాండుని జనం అవసరాలను గమనించిన పార్టీలు గుర్తించి ఆయా పార్టీల నేతలు డిమాండ్లు చేస్తున్నారు.

ఇందులో మొదటి స్థానంలో ఉన్నది అతి పెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్‌. ఆ పార్టీ ఇపుడు ఈ డిమాండ్ ని నెత్తికెత్తుకుంది. నేపాల్ లో పూర్తి అధికారం కోసం తన ప్రాభవం కోసం నేపాలీ కాంగ్రెస్ ఈ విధంగా ప్రజల డిమాండ్ ని ఆసరాగా చేసుకుని ముందుకు అడుగులు వేస్తొంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన సుమారు 950 మంది జనరల్ కమిటీ సభ్యులు తాజాగా జరిగిన ఒక సమావేశంలో హిందూ రాజ్యాన్ని డిమాండ్ చేస్తూ పిటిషన్‌పై సంతకం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న 14వ మహా సమితి సమావేశాల్లో ఈ తీర్మానాన్ని ఆమోదించారు కూడా.

నేపాలీ కాంగ్రెస్ లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అతిపెద్ద సమావేశంగా దీన్ని పేర్కొంటారు. అలాంటి మహాసమితిలో ఈ తీర్మానానికి ఆమోదం లభించడం గమనార్హం. ఈ సమావేశంలో దాదాపు 2200 మంది కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. పార్టీ కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు శంకర్ బండారీ నేపాల్ హిందూ దేశంగా మారాలన్న డిమాండుకు నేతృత్వం వహిస్తున్నారు. దాంతో ఆయన నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ షేర్ బహదూర్ దేవుబా ముందు కూడా తమ డిమాండ్లను వినిపించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అధ్యక్షుడు చెప్పినట్టు తెలుస్తోంది.

కానీ ఇది నేపాల్ లో అత్యధిక శాతం జనం మాట అని శంకర్ బండారీ వాదిస్తున్నారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ప్రజాభిప్రాయాన్ని మన్నించకపోతే పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని నేపాలీ కాంగ్రెస్ పార్టీ అధినేతకే శంకర్ బండారీ చెప్పి హెచ్చరించారని అంటున్నారు.

మరో వైపు చూస్తే నేపాల్ ని హిందూ రాజ్యంగా చేయాలన్న డిమాండ్‌పై సీపీఎన్-యూఎమ్ఎల్, సీపీఎన్ (మావోయిస్ట్ సెంటర్)‌లు సైలెంట్ గా ఉంటూ అన్నీ గమనిస్తున్నాయి. అయితే మరో కీలక పరిణామం ఏంటి అంటే నేపాల్ దేశంలో నాలుగవ అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా ఈ డిమాండ్‌తో ఏకీభవించడం.

మొత్తం మీద చూస్తే చాలా తొందరలోనే నేపాల్ హిందూ దేశంగా మారబోతోంది అని అంటున్నారు. అదే జరిగితే పొరుగున మోగిన హిందూత్వ నినాదం భారత్ లోనూ కీలక మార్పులకు దోహదం చేస్తుందని అంటున్నారు. అంతే కాదు 2024 సార్వత్రిక ఎన్నికల తరువాత మరోసారి బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తే కనుక భారత్ లో కూడా ఆ తరహా డిమాండ్లు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.