Begin typing your search above and press return to search.

కుప్పం.. ఇకపై గ్లోబల్ బ్రాండ్.. సీఎం సొంత నియోజకవర్గంలో భారీ పరిశ్రమకు లైన్ క్లియర్

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో భారీ పరిశ్రమ స్థాపనకు హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకొచ్చింది.

By:  Tupaki Desk   |   28 Aug 2025 3:28 PM IST
కుప్పం.. ఇకపై గ్లోబల్ బ్రాండ్.. సీఎం సొంత నియోజకవర్గంలో భారీ పరిశ్రమకు లైన్ క్లియర్
X

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో భారీ పరిశ్రమ స్థాపనకు హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముందుకొచ్చింది. యాపిల్ ఐఫోన్ విడిభాగాలను సప్లై చేసే హిందాల్కో కుప్పంలో అత్యాధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరించింది. సుమారు రూ.586 కోట్లతో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమతో వెయ్యి మందికి ప్రత్యక్షంగా మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని అధికారులు హైలెట్ చేస్తున్నారు. త్వరలో జరిగే రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో హిందాల్కో సంస్థకు అనుమతులు మంజూరు చేసే అంశాన్ని ఆమోదించనున్నారు.

గత ఏడాది జూన్ 12న ఏపీకి నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. గడిచిన 14 నెలలుగా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను స్థాపించడం అన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. దాదాపు 9 లక్షల కోట్ల మేర ఒప్పందాలు చేసుకుని 8 లక్షల ఉద్యోగాల సృష్టికి అడుగులు వేశారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థలు కొన్నిచోట్ల నిర్మాణాలు ప్రారంభించగా, మరికొన్ని అనుమతులు అన్నీ రాగానే నిర్మాణ పనుల ప్రారంభానికి రెడీ అవుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మాత్రం ఇంతవరకు ఒక పెద్ద పరిశ్రమ కూడా లేదు. పూర్తిగా వ్యవసాయాధారిత నియోజకవర్గమైన కుప్పం చుట్టుపక్కల ప్రాంతాలను విద్య, వైద్య రంగాల్లోనే అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు దృష్టి పెట్టారు. కానీ, తొలిసారిగా కుప్పం నియోజకవర్గానికి ఉన్న భౌగోళిక పరిస్థితులను అంచనా వేసిన హిందాల్కో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.

రెండు మెట్రో నగరాలకు అతి సమీపంలో ఉండటంతో కుప్పంలో అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని హిందాల్కో సంస్థ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గం బెంగళూరు మహానగరానికి 120 కిలోమీటర్లు, చెన్నై మెట్రో సిటీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు మెగా సిటీలకు అందుబాటులో ఉన్న కుప్పంలో పరిశ్రమ పెడితే మార్కెట్ తోపాటు రవాణా సౌకర్యాలకు ఇబ్బంది ఉండదన్న ఆలోచనతో హిందాల్కో వ్యూహాత్మకంగా కొత్త పరిశ్రమ స్థాపనకు కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడంతో అనుమతులు త్వరగా వస్తాయని భావనతో ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు చెబుతున్నారు.

అల్యూమినియం ఉత్పత్తులలో హిందాల్కో తన ప్రత్యేకత చాటుకుంది. యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్‌ల ఛాసిస్ (బాడీ) లను ప్రత్యేకంగా తయారు చేస్తుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన హిందాల్కో అల్యూమినియం, రాగి ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా చెబుతారు. 1958లో స్థాపించగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విస్తరించింది. ఆటోమొబైల్స్, విమానాలు, ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు హిందాల్కో ఉత్పత్తులపై ఆధారపడ్డాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

కుప్పంలో ఏర్పాటు కానున్న హిందాల్కో ప్రాజెక్ట్ కేవలం ఉద్యోగాల కల్పనకే పరిమితం కాదని అంటున్నారు. "మేక్ ఇన్ ఇండియా" నినాదంతో రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేసి "మేక్ ఫర్ ది వరల్డ్" లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా అల్యూమినియం పరిశ్రమలకు ముడిసరుకు అందిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఐఫోన్ విడిభాగాలను ఇప్పుడు దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో తయారు చేయడం అనేది పారిశ్రామిక అభివృద్ధికి, సాంకేతిక పురోగతికి ఒక గొప్ప సంకేతంగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వంతో ఒప్పందం జరగగానే పనులు ప్రారంభించి 2027 నాటికి ఉత్పత్తులు మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకురావాలని హిందాల్కో భావిస్తున్నట్లు చెబుతున్నారు.