Begin typing your search above and press return to search.

రాహుల్ కుక్క బిస్కెట్లు.. అసోం సీఎంకు నచ్చలేదట

అసోం సీఎం హిమంత విశ్వ శర్మ ఎంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో అందరికీ తెలిసిందే. అందులోనూ కరుడుగట్టిన హిందూత్వవాదిలా కనిపిస్తారాయన.

By:  Tupaki Desk   |   6 Feb 2024 1:30 PM GMT
రాహుల్ కుక్క బిస్కెట్లు.. అసోం సీఎంకు నచ్చలేదట
X

ఆయన మొదట్లో కాంగ్రెస్ వాదే. ఆ పార్టీలోనే రాష్ట్రస్థాయికి ఎదిగారు. సీఎం స్థాయికీ వెళ్లారు. అయితే, స్థానిక నాయకత్వంతో పడలేదు. వర్గపోరు తీర్చమంటూ ఢిల్లీ వెళ్లారు. అక్కడ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు చెబుతారు. తాము రాష్ట్రంలో పార్టీ కొంప మునుగుతోందంటూ చెప్పడానికి వస్తే.. తమ నాయకుడేమో పెంపుడు కుక్కతో ఆడుకుంటూ పట్టించుకుకోలేదని ఆరోపించారు. ఆ కోపంతోనే పార్టీ మారారు. ఏకంగా ఇప్పుడు సీఎం అయ్యారు. తన మాజీ నాయకుడిని అవకాశం దొరికినప్పుడల్లా ఏకిపడేస్తున్నారు. వ్యక్తిగతంగానూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

హిమంత.. హిందూ మత

అసోం సీఎం హిమంత విశ్వ శర్మ ఎంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో అందరికీ తెలిసిందే. అందులోనూ కరుడుగట్టిన హిందూత్వవాదిలా కనిపిస్తారాయన. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అంటే మరీ విరుచుకుపడతారు. ఇటీవల రాహుల్ పాదయాత్ర అసోంలో జరుగుతుండగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరూ చూశారు. వాస్తవానికి కాంగ్రెస్ నుంచే బీజేపీలోకి వెళ్లారు హిమంత. పైన చెప్పుకున్న ఉదాహరణలో కుక్కతో ఆడుకున్నది రాహుల్ అయితే.. అసోం పరిస్థితులను నివేదించడానికి వెళ్లింది హిమంత. ఆ మంట ఇప్పటికీ రగులుతూనే ఉంది. అన్నట్లు ఆ మధ్య హిమంత హైదరాబాద్ కు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

రాహుల్ యాత్రలో..

రాహుల్ గాంధీ ప్రస్తుత భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు రోజుల కిందట ఝార్ఖండ్ లోకి యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా ఓ కార్యకర్త చేతికి కుక్క తినే బిస్కెట్లు ఇచ్చారంటూ ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఇదే అదనుగా బీజేపీ నేతలు సోషల్ మీడియాకెక్కారు. వీడియోను షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు. బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ మాట్లాడుతూ.. ఇటీవల ఖర్గే కాంగ్రెస్ బూత్ కార్యకర్తలను కుక్కలతో పోల్చారని.. ఇప్పుడు రాహుల్ ఇలా చేశారని వ్యాఖ్యానించారు. వారి చూసే కోణంలోనే తప్పు ఉందని వ్యాఖ్యానించారు. దీన్ని కొందరు హిమంతకు ట్యాగ్‌ చేశారు.

ఫ్లాష్ బ్యాక్ లోకి హిమంత..

రాహుల్ వీడియో గుర్తుచేస్తూ హిమంత గతంలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ లో ఉండగా పార్టీ మీటింగ్‌ లకు రాహుల్‌ ఇంటికి వెళ్లేవాడినని.. ఆయన పెంపుడు కుక్క ‘పిడి’ తినే ప్లేటు నుంచే తమకు బిస్కెట్లు ఆఫర్‌ చేసేవారని గతంలో చెప్పారు. తాజాగా నెటిజన్ ఒకరు తనను ట్యాగ్ చేయగా.. ఆయన స్పందించారు. ‘‘రాహుల్ మాత్రమే కాదు. ఆయన కుటుంబం మొత్తం కలిసినా నన్ను ఆ బిస్కెట్ తినేలా చేయలేకపోయారు. ఆ కుక్క బిస్కెట్లు నిరాకరించి కాంగ్రెస్‌ కు రాజీనామా చేశా" అని చెప్పుకొచ్చారు.

ఇదీ రాహుల్ వివరణ..

కార్యకర్తకు కుక్క బిస్కెట్లు ఇచ్చిన వివాదంపై రాహుల్ స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఏ కార్యకర్తతో మాట్లాడానో అతడిదే ఆ కుక్క పిల్ల. దానిని చూడగానే ముచ్చటేసింది. దగ్గరకు తీసుకుని బిస్కెట్లు ఇస్తే అది భయపడిపోయింది. దీంతో దాని యజమాని అయిన కార్యకర్తకు బిస్కెట్లు ఇచ్చి నువ్వే దానికి తినిపించమని చెప్పా. ఇందులో వివాదం ఏముంది?’’ అని గట్టి కౌంటర్ ఇచ్చారు.