Begin typing your search above and press return to search.

త్వరలో ఆ రాష్ట్రంలో బహుభార్యత్వం నిషేధం?

అయితే ఈ బిల్లుపై గవర్నర్‌ కు బదులుగా రాష్ట్రపతి ఆమోదించేలా చేయాలని కమిటీ సూచించింది

By:  Tupaki Desk   |   8 Aug 2023 5:30 PM GMT
త్వరలో ఆ రాష్ట్రంలో  బహుభార్యత్వం నిషేధం?
X

భారత్‌ లో ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉండటం చట్టరీత్యా నేరం. హిందూ వివాహ చట్టం ఇందుకు సమ్మతి లభించదు. ఇండియన్ పీనల్ కోడ్‌ ప్రకారమూ దీన్ని నేరంగానే పరిగణిస్తారు. బౌద్ధులు, జైనులు, సిక్కులు కూడా హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తారు. అయితే... ముస్లిం చట్టంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది.

ఇస్లాం మతానికి చెందిన పురుషులు నలుగురు మహిళలను పెళ్లి చేసుకునేందుకు సమ్మతి ఉంటుంది. కాకపోతే... వాళ్లందరికీ సమాన హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలో అసోం ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. బహు భార్యత్వంపై నిషేధం విధించే దిశగా హిమంత బిస్వ శర్మ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

అవును... బహు భార్యత్వం నిషేధంపై న్యాయపరమైన అంశాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ దానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని హిమంత బిస్వా శర్మ చెప్పారు.

అయితే ఈ బిల్లుపై గవర్నర్‌ కు బదులుగా రాష్ట్రపతి ఆమోదించేలా చేయాలని కమిటీ సూచించింది.

ఈ నేపథ్యంలో బిల్లుని ఈ ఆర్థిక సంవత్సరంలో కచ్చితంగా ప్రవేశపెట్టేలా హిమంత బిస్వ శర్మ పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... వచ్చే సెప్టెంబర్, డిసెంబర్‌ నెలల్లో జరిగే శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలని భావిస్తున్నారట.

నిజానికి అస్సాంలో ఇలాంటి చట్టాన్ని ఎన్నడూ ప్రవేశపెట్టలేదు. దీంతో ఈ బిల్లుపై చర్చకు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాల్సి ఉంటుందని, ఈ విషయంపై తమ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఈ బహుభార్యత్వ చట్టానికి ముందు యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) అమల్లోకి వస్తే, పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు.