'మీరు 14 జన్మలు ఎత్తాలి'... బంగ్లాకు అస్సాం సీఎం మాస్ వార్నింగ్!
బంగ్లాదేశ్ ను ఈశాన్య ప్రాంతాలతో కలిపే భారతదేశ చికెన్ నెక్స్ కారిడార్ పై ఢాకా రాజకీయాలు రాజుకుంటున్న వేళ.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 22 May 2025 9:40 PM ISTబంగ్లాదేశ్ ను ఈశాన్య ప్రాంతాలతో కలిపే భారతదేశ చికెన్ నెక్స్ కారిడార్ పై ఢాకా రాజకీయాలు రాజుకుంటున్న వేళ.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. మన సిలిగుడి కారిడార్ (చికెన్ నెక్) విషయంలో బంగ్లా అనుసరిస్తోన్న విధానాలను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు.
అవును... బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత చికెన్ నెక్ విషయంలో బంగ్లా తాజాగా అనుసరిస్తోన్న విధానాలను ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేశారు. ఈ కారిడార్ కు కేవలం 100 కి.మీ. దూరంలో ఉన్న లాల్ మోనిర్హాట్ ఎయిర్ బేస్ ను పునరుద్ధరించేందుకు బంగ్లాదేశ్ కు చైనా సహాయం చేస్తుందనే ఆరోపణలే ఆయన వార్నింగ్ కు కారణమని తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన సీఎం హిమంత.. మన దగ్గర చికెన్ నెక్ ఉంది కానీ.. బంగ్లా వద్ద రెండు చికెన్ నెక్ లు ఉన్నాయి.. మనదానిపై దాడిచేస్తే.. మనం ఆ రెండింటిపైనా చేస్తాం.. అని వ్యాఖ్యానించారు. బంగ్లాలో ఇదే సమయంలో చిట్టగాంగ్ ఓడరేవును అనుసంధానించే ప్రాంతం భారత చికెన్ నెక్ కంటే సన్నగా ఉంటుంది.. ఒక్క రాయి విసిరే అంత దూరంలోనే ఉంది అని అన్నారు.
ఇదే సమయంలో... భారతదేశ సైన్యం పరాక్రమాన్ని మరోసారి బంగ్లాదేశ్ కు గుర్తు చేసిన హిమంత... ఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయాన్ని ప్రస్థావించారు. ఈ సందర్భంగా... భారత్ పై దాడి చేయాలంటే బంగ్లాదేశ్ 14 జన్మలు ఎత్తాలని ఆయన ఎద్దేవా చేశారు! హిమంత తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఓ కీలక కారణం ఉంది!
వాస్తవానికి ఈశాన్య భారత్ లోని ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు, రోడ్డు మార్గాలు మన చికెన్ నెక్ (సిలిగుడి కారిడార్) నుంచి వెళ్తాయి. దీంతోపాటు కీలకమైన కమ్యునికేషన్స్ కేబుల్స్ కు, పైప్ లైన్స్ కు ఇదే మార్గం! వెస్ట్ బెంగాల్ లో ఉన్న ఈ ప్రాంతంలో కొంతభాగం కేవలం 22 కి.మీ. వెడల్పులోనే ఉండగా.. అది నేపాల్, బంగ్లాలకు అత్యంత సమీపంలో ఉంది.
ఇదే సమయంలో ప్రధానంగా చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలోనే ఉంది. ఈ క్రమంలో... ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని కొన్ని దశాబ్ధాలుగా సైనిక వ్యూహకర్తలు ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలో ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ తో భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని.. ఆ ప్రాంతానికి తామే రక్షకులమని అన్నారు. దీనిపై భారత్ స్ట్రాంగ్ గా స్పందించగా.. తాజాగా హిమంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
