పాకిస్థాన్‌కు అస్సాం సీఎం అదిరిపోయే కౌంటర్!
సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో "బ్రహ్మపుత్ర నది నీటిని చైనా నిలిపివేస్తే మీ పరిస్థితి ఏంటి?" అంటూ పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీటుగా స్పందించారు.
By: Tupaki Desk | 3 Jun 2025 12:52 PM ISTసింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో "బ్రహ్మపుత్ర నది నీటిని చైనా నిలిపివేస్తే మీ పరిస్థితి ఏంటి?" అంటూ పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీటుగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా పాకిస్థాన్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
పాకిస్థాన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సీఎం శర్మ, "బ్రహ్మపుత్ర నది ప్రవాహంలో చైనా నుంచి వచ్చేది కేవలం 30-35% మాత్రమే. మిగిలిన 65-70% నీరు భారతదేశంలో కురిసే వర్షాల ద్వారానే నదిలోకి వస్తుంది. కాబట్టి, మేము ఈ నదిపై ఆధారపడలేదు" అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా "ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నది నీటిని ఆపివేస్తే, అది మాకు మేలే తప్ప నష్టం కాదు. అస్సాంలో ప్రతి సంవత్సరం సంభవించే వరదలు తగ్గుతాయి" అని పేర్కొంటూ పాకిస్థాన్‌కు షాకిచ్చారు.
ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ వాదనలకు చెక్ పెడుతూ, బ్రహ్మపుత్ర నదిపై భారత్ కు ఉన్న స్వావలంబనను స్పష్టం చేశాయి. చైనా నుంచి వచ్చే నీటిపై అస్సాం పూర్తిగా ఆధారపడలేదని, పైగా చైనా నీటిని నిలిపివేస్తే వరదలు తగ్గుతాయని సీఎం శర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇది భారత్-పాకిస్థాన్ మధ్య జల వివాదాల నేపథ్యంలో అస్సాం వైఖరిని మరింత పటిష్టం చేసింది.
సింధూ జలాల వివాదం అనేది భారతదేశం , పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న ఒక ముఖ్యమైన జలవివాదం. ఈ వివాదం సింధూ నదీ వ్యవస్థ లోని నదుల మీద అధికారం, వాటి వినియోగం , వాటి తీరుపై ఆధారపడి ఉంటుంది.
1947లో భారత విభజన అనంతరం, సింధూ నదీ వ్యవస్థ రెండు దేశాలకు విభజితమైంది. కానీ ఈ నదులు ప్రధానంగా పాకిస్తాన్ ద్వారా ప్రవహిస్తాయి, అయితే వాటి మూలాలు భారతదేశంలో ఉన్నాయి.దీని వల్లే రెండు దేశాల మధ్య జలాల వినియోగంపై వివాదం తలెత్తింది.ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో 1960లో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్‌లు ఈ ఒప్పందంపై సంతకం చేశారు.
సింధూ నదీ వ్యవస్థలోని 6 ప్రధాన నదులను పరిగణనలోకి తీసుకున్నారు: పశ్చిమ నదులు అయిన ఇండస్, జేళం, చెనాబ్ – ఇవి పాకిస్తాన్ కు కేటాయించబడ్డాయి. తూర్పు నదులు అయిన రవి, బీయాస్, సుట్లెజ్ ఇవి భారతదేశంకు కేటాయించబడ్డాయి.
అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు సిందూ జలాలను భారత్ నిలుపుదల చేసింది. దీంతో ఈ వివాదం చెలరేగింది.
