Begin typing your search above and press return to search.

మైనార్టీలో హిమాచల్ కాంగ్రెస్ సర్కార్.. అసలేం జరిగింది?

తాజాగా ముగిసిన రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మైనార్టీలో పడింది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 4:36 AM GMT
మైనార్టీలో హిమాచల్ కాంగ్రెస్ సర్కార్.. అసలేం జరిగింది?
X

కీలకమైన లోక్ సభ ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్న వేళలోనూ మోడీ నేత్రత్వంలోని బీజేపీ తన దూకుడును తగ్గించట్లేదు. ఎవరేం అనుకుంటున్నారన్న విషయాన్ని పక్కన పెట్టేసి.. బలంగా ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలపై బలంగా దెబ్బ తీయాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల్ని ఖతం పట్టించిన మోడీషాలు.. ఇప్పుడు మరో రాష్ట్రాన్ని టార్గెట్ చేశారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

తాజాగా ముగిసిన రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మైనార్టీలో పడింది. రాజ్యసభ పోలింగ్ సందర్భంగా పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో హిమాచల్ ప్రదేశ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మైనార్టీలో పడినట్లైంది. రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేశారు. దీంతో.. బీజేపీ.. కాంగ్రెస్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు పడటం.. చివరకు లాటరీ తీయగా.. అందులో లక్కీగా బీజేపీ అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటించారు.

దీంతో.. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి ఓటమి పాలు కాగా.. బీజేపీ అభ్యర్తి హర్ష మహజన్ గెలుపొందారు. ఈ పరిణామం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. 68 మంది ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సాధారణ మెజార్టీ 35 మంది ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి34 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉందన్న విషయం తాజాగా ముగిసిన రాజ్యసభ ఎన్నికలతో తెలిసిపోయింది.

దీంతో.. బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ డివిజన్ ఓటింగ్ కు పట్టుబడితే ప్రభుత్వం మైనార్టీలో పడటమే కాదు.. ముఖ్యమంత్రిగా ఉన్న సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారుకు నూకలు చెల్లినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా బీజేపీ నేతలు ఇప్పుడు ముఖ్యమంత్రి రాజీనామాను బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 40 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 25, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయటంతో.. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 34కు తగ్గితే.. బీజేపీ బలం 34కు పెరిగింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన ఒక్క ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకురావటం పెద్ద విషయం కాదని.. త్వరలో హిమాచల్ ప్రదేశ్ లో అధికార మార్పిడికి అవకాశం ఉందంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు హుటాహుటిన హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరి వెళ్లారు.