జీతాలు కట్ - హిమాచల్ ఖజానా ఖాళీ !
దేశంలో ఒక రాష్ట్రం ఖజానా ఖాళీ చేసుకుని పెను ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.
By: Satya P | 22 April 2026 8:15 AM ISTదేశంలో ఒక రాష్ట్రం ఖజానా ఖాళీ చేసుకుని పెను ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న ఈ రాష్ట్రం ఇపుడు ఆర్ధికంగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. దాంతో దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా అతి పెద్ద రికార్డుని సాధిస్తోంది. అదే జీతాల్లో భారీ కోతలు అది ఉన్నతాధికారుల నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు వారి జీతాల విషయంలో కోత పెట్టాలని సంచలన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
జీతాల్లో భారీ కోత :
ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దాంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరంలో సరికొత్త్త నిర్ణయమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఏప్రిల్ 2026 నుంచి ఆరు నెలల పాటు సీనియర్ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేల జీతాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఆరు నెలల పాటు కొనసాగే ఈ చర్యలలో భాగంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డీజీపీ వంటి ఉన్నతాధికారులకు 30 శాతం అలాగే ముఖ్యమంత్రికి 50 శాతం జీతాల్లో కోత పెట్టాలని కూడా నిర్ణయించింది.
కారణాలు ఇవేనట :
ఇంతలా అధికారులు మంత్రులు ఎమ్మెల్యేల జీతాల కోతకు సంబంధించిన కీలక వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. అదనపు ప్రధాన కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఉన్నత అటవీ అధికారులతో సహా అత్యున్నత స్థాయి అధికారులకు సైతం ఈ జీతాల కోత వర్తిస్తుంది. అదే విధంగా విభాగాధిపతులు ఇన్‌స్పెక్టర్ జనరల్‌ల వంటి మధ్య స్థాయి అధికారులకు 20 శాతం జీతాల కోత వర్తిస్తుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి జీతాన్ని 50 శాతం మంత్రుల జీతాన్ని 30 శాతం, ఎమ్మెల్యేల జీతాన్ని 20 శాతం మేర కోతను విధిస్తూ ఈ నిర్ణయాన్ని ఆరు నెలల పాటు కొనసాగిస్తారు. అయితే ఇది శాశ్వతమైన కోత అయితే కాదని తాత్కాలికమైనది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడమే దీని వెనక ఉన్న లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఒక వేళ భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే దానిని బట్టి నిలిపివేసిన జీతాల మొత్తాలను తర్వాత విడుదల చేసే ప్రణాళికలు ఉన్నాయని కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
బడ్జెట్ లో భారీ కోత :
మరో వైపు చూస్తే 2026–27 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌లో 3,586 కోట్ల రూపాయల మేర కోత విధించిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రభుత్వం తీసుకుందని చెబుతున్నారు. గత ప్రభుత్వాల నుండి వారసత్వంగా వచ్చిన అప్పులతో సహా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ చర్యలను అవసరమైన పొదుపు చర్యలుగా అభివర్ణిస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. తమ జీతాలు కోత విషయంలో చట్టపరమైన మార్గాల ద్వారా సవాల్ చేసేందుకు చూస్తున్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే ఇది ప్రభుత్వానికి, పాలకవర్గానికి మధ్య మరో కొత్త ఘర్షణకు దారితీయవచ్చని అంటున్నారు.
అప్పులు లక్ష కోట్లు :
హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం. అయితే అప్పులు మాత్రం బారెడు ఉన్నాయి. అవి పెరిగి పెద్దవై 2026 ప్రారంభంలోనే తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి కారణం ఇప్పటికే ఒక లక్ష కోట్లకు పైగా అప్పులున్నాయి. అలాగే ఆరు వేల కోట్ల దాకా రెవెన్యూ లోటు ఉంది. రాష్ట్రానికి మొత్తం రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉన్నాయి. రాష్ట్ర నిధులలో సుమారు 92 శాతం జీతాలు, పెన్షన్లు వడ్డీ చెల్లింపులకే కేటాయించబడుతోంది. దాంతో ఖర్చులు అయితే తడిసి మోపెడు కావటంతో ఈ ఏడాది రాషృఅ ప్రభుత్వం బడ్జెట్‌ను ఏకంగా మూడు వేల కోట్లకు కోట్లు తగ్గించడం, ఇంధన సెస్సులను ప్రవేశపెట్టడం ఉన్నతాధికారుల జీతాలలో కోత విధించడం వంటి సీరియస్ యాక్షన్ కి దిగుతోంది. మరో వైపు కొన్ని కేంద్ర గ్రాంట్లను నిలిపివేయడం ఆర్థిక ఇబ్బందులను మరింత తీవ్రతరం అవుతున్నాయని అంటున్నారు. ఆఖరికి పరిస్థితి ఎంతలా వచ్చిందంటే రాష్ట్రం ప్రస్తుతం రోజువారీ ఖర్చులను నిర్వహించడానికి అప్పులపై ఎక్కువగా ఆధారపడి ఉందని చెబుతున్నారు. సంక్షేమం పేరుతో అధికంగా అప్పులు చేసే రాష్ట్రాలకు హిమాచల్ ప్రదేశ్ కళ్ళ ఎదుట నిలువెత్తు ఉదాహరణ అని అంటున్నారు.
