ఇద్దరు భర్తల ముద్దుల భార్య.. వైరల్ గా తాజా పెళ్లి
అవును.. ఇప్పుడో పెళ్లి వైరల్ గా మారింది. ఒక వ్యక్తి ఇద్దరు.. ముగ్గురు భార్యల్ని కలిగి ఉండటం తెలిసిందే.
By: Tupaki Desk | 20 July 2025 10:44 AM ISTఅవును.. ఇప్పుడో పెళ్లి వైరల్ గా మారింది. ఒక వ్యక్తి ఇద్దరు.. ముగ్గురు భార్యల్ని కలిగి ఉండటం తెలిసిందే. అందుకు భిన్నంగా అన్నదమ్ములు ఇద్దరు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం.. సంప్రదాయబద్ధంగా మూడు రోజుల పెళ్లి చేసుకున్న వైనం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే.. ఈ సిత్రమైన పెళ్లి వెనుక ఒక పురాతన ఆచారం ఉంది. ఆ తెగలో ఉన్న పాత సంప్రదాయాన్ని తాజాగా కొనసాగించిన ఈ పెళ్లి ముచ్చట సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
హిమాచల్ ప్రదేశ్ లోని సిర్ మౌర్ జిల్లాలోని ఒక గ్రామం ఈ పెళ్లికి వేదికైంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వీరు ప్రాతినిధ్యం వహించే హట్టి తెగలో ఒకే ఇంటికి చెందిన అన్నతమ్ముళ్లు ఒకే అమ్మాయిని చేసుకోవటం ఒక సంప్రదాయం. శతాబ్దాల క్రితం నుంచి వస్తున్న ఈ ఆచారం వెనుక ఒక లాజిక్ లేకపోలేదు. అదేమంటే.. కుటుంబ ఐకమత్యాన్ని కాపాడేందుకు.. పూర్వీకుల ఆస్తుల్ని రక్షించుకోవటానికి.. తమ తెగ మహిళ వితంతువుగా ఉండకూదన్న ఉద్దేశంతో ఈ తరహా ఆచారాన్ని పాటించేవారు.
కాకుంటే ఇప్పటివరకు ఈ తెగ వారు చేసుకునే ఈ పెళ్లిళ్లు గోప్యంగా ఉంచేవారు. కానీ.. తాజా పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా.. శాస్త్రోక్తంగా జరగటంతో ఈ పెళ్లి ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాము తమ ఆచారాలకు తగినట్లే పెళ్లి చేసుకున్నట్లుగా వధువరులు చెబుతున్నారు. తన ఇష్టపూర్వకంగానే ఇద్దరిని పెళ్లి చేసుకుంటున్నట్లుగా నవ వధువు సునీత చెబితే.. ఆమెను పెళ్లాడిన అన్నదమ్ములు ఇద్దరు కూడా అన్నీ విషయాల మీద అవగాహనతోనే తామీ పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పారు.
తమను ఎవరు ఒత్తిడి చేయలేదని.. తమ పెళ్లి తమ ఇష్టప్రకారమే జరిగిందని.. ఈ ఆచారం గురించి తమకు తెలుసని.. అందరం కలిసి తీసుకున్న నిర్ణయంగా వారు చెబుతున్నారు. తమ బంధంపై తనకు నమ్మకం ఉందని వధువు సునీత వెల్లడించారు. ఈ సంప్రదాయాన్ని హట్టి తెగ వారు జోడిధారణ లేదంటే ద్రౌపది ప్రాథగా పిలుచుకుంటారు. సిర్ మౌర్ జిల్లాల్లోని ఈ సంప్రదాయం ఇక్కడో ఆచారంగా మారింది.
ఉత్తరాఖండ్ లోని కొన్ని జిల్లాల్లో ఈ ఆచారం ఉంది.తాజాగా జరిగిన పెళ్లి విషయానికి వస్తే.. ఒకే వధువును పెళ్లి చేసుకున్న అన్నదమ్ముల్లో పెద్దవాడు కపిల్. అతను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. జలశక్తి శాఖలో పని చేస్తుంటాడు. అతని తమ్ముడు కపిల్. అతను విదేశాల్లో జాబ్ చేస్తుంటాడు. ఇద్దరు దూరంగా ఉన్నా.. సునీతను పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం శాస్త్రాలను ఫాలో అయ్యారు. తమ ఆచారాల్ని తాము ఫాలో అయ్యామని.. తమ చరిత్రపట్ల తమకు గర్వంగా ఉందన్నారు. తాను విదేశాల్లో ఉన్నా తన భార్యకు తన సపోర్టు ఉంటుందని కపిల్ చెబుతున్నారు.వీరి పెళ్లి మూడు రోజుల పాటు భారీ ఎత్తున జరిగింది. ఈ వేడుక ఇప్పుడు ఆసక్తికరంగా మారటమేకాదు.. అందరిని ఆకర్షిస్తోంది.
