Begin typing your search above and press return to search.

రీల్ లో కనిపించే దొంగ ఈసారి రియల్ గా.. నేపాల్ లో ఖరీదైన హోటల్

రీల్ లో మాత్రమే కనిపించే క్యారెక్టర్లు రియల్ లైఫ్ లోనూ కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 4:51 AM GMT
రీల్ లో కనిపించే దొంగ ఈసారి రియల్ గా.. నేపాల్ లో ఖరీదైన హోటల్
X

రీల్ లో మాత్రమే కనిపించే క్యారెక్టర్లు రియల్ లైఫ్ లోనూ కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటిదే చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు తాజాగా ఒక దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతగాడిని విచారించిన నేపథ్యంలో బయటకొచ్చిన సంచలన విషయాలతో విచారించే పోలీసులు సైతం అవాక్కు అయ్యారు. గడిచిన కొన్నేళ్లలో ఏకంగా 200లకు పైగా చోరీలు చేసిన ఇతగాడికి భారీ ఆస్తులు ఉండటం ఒక ఎత్తు అయితే..నేపాల్ లో ఏకంగా ఒక హోటల్ ను నిర్మించిన వైనం మరింత షాకింగ్ గా మారింది.అంతేకాదు.. ఢిల్లీలోని ఇళ్లను కూడబెట్టిన ఈ సంపన్న దొంగ పేరు మనోజ్ చౌబే. అతగాడి వయసు 45. ఇంతకూ ఢిల్లీ పోలీసులు ఏం చెప్పారంటే..

యూపీకి చెందిన మనోజ్ .. అతని కుటుంబం దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్ కు వెళ్లిపోయారు. 1997లో అతడు ఒంటరిగా ఢిల్లీకి వచ్చారు. కీర్తినగర్ పోలీస్ స్టేషన్ లో క్యాంటీన్ నిర్వహించేవాడు. అయితే.. అందులో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతను తొలిసారి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన అతను ఇళ్లను టార్గెట్ చేయటం మొదలు పెట్టాడు. మధ్య మధ్యలో పోలీసులకు దొరికినా.. అతని అసలు వివరాలు మాత్రం బయటకు రాలేదు.

జైలుకు వెళ్లటం.. బయటకు రావటం.. పెద్ద ఎత్తున చోరీలు చేస్తూ భారీగా కూడబెట్టాడు. ఆ మెత్తంతో నేపాల్ లో ఒక ఖరీదైన హోటల్ కు యజమానిగా మారాడు. కాకుంటే.. దాన్ని తన భార్య పేరు మీద పెట్టాడు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. యూపీకి చెందిన ఒక ప్రభుత్వ అధికారి కుమార్తెను వివాహమాడిన అతను.. తాను ఢిల్లీలో పార్కింగ్ కాంట్రాక్టు పనులు చేస్తుంటానని చెప్పటం విశేషం. తన వ్యాపార పనుల్లో భాగంగా ఆర్నెల్లకోసారి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుందని చెప్పిన ఇతగాడు చేసే పని.. ఆ సమయంలో దొంగతనాలు చేయటం. గడిచిన కొన్నేళ్లలో 200 చోరీల్ని సింగిల్ హ్యాండ్ తో చేసిన అతడ్ని.. తాజాగా ఒక చోరీ కేసులో ఢిల్లీ పోలీసులు పట్టుకోవటం.. ఈసారి అతడ్ని లోతుగా విచారించిన నేపథ్యంలో బయటకు వచ్చిన సంచలన విషయాలు పోలీసులకు సైతం షాకింగ్ గా మారాయని చెబుతున్నారు.