Begin typing your search above and press return to search.

జ‌డ్జిల‌పై దూష‌ణల కేసు... టీడీపీ నేత‌ల‌కు హైకోర్టు నోటీసులు!

ఈ క్రమంలో ఇప్పటికే కొంద‌రు టీడీపీ నేత‌ల‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు... ఇవాళ మ‌రికొంద‌రికి నోటీసులు జారీ చేసి, విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసింది.

By:  Tupaki Desk   |   21 Nov 2023 11:56 AM GMT
జ‌డ్జిల‌పై దూష‌ణల కేసు... టీడీపీ నేత‌ల‌కు హైకోర్టు నోటీసులు!
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సమయంలో... అందుకు అంగీకరించని హైకోర్టు ఆ పిటిషన్‌ ను కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పునిచ్చిన హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏసీబీ న్యాయాధికారి లక్ష్యంగా టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాయి. ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించి పలువురు టీడీపీ నాయకులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది.

అవును... నాడు జ‌డ్జిల‌పై దూష‌ణ‌ల‌కు సంబంధించి హైకోర్టులో ప్రస్తుతం విచార‌ణ జ‌రుగుతోంది. ఇందులో భాగంగా రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్నల‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది! జ‌డ్జిల‌ను దూషిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టడంతోపాటు.. టీడీపీ అనుకూల చాన‌ళ్లతో మాట్లాడుతూ జ‌డ్జిల‌ను కించ‌ప‌రిచేలా కామెంట్స్ చేశారనేది అభియోగం!

వీరిపై క్రిమినల్‌ కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ అడ్వకేట్‌ జనరల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో టీడీపీ నేత‌ల‌తో పాటు గూగుల్‌, ఫేస్‌ బుక్‌, ట్విట‌ర్‌ ల‌కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే కొంద‌రు టీడీపీ నేత‌ల‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు... ఇవాళ మ‌రికొంద‌రికి నోటీసులు జారీ చేసి, విచార‌ణ‌ను రెండు వారాల‌కు వాయిదా వేసింది.

కాగా... స్కిల్‌ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు వేసిన‌ క్వాష్‌ పిటిషన్‌ ను విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి దానిని కొట్టేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయాధికారితో పాటు మరో న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు నేతలు, ఇతరులు సోషల్‌ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టులు పెద్ద ఎత్తున పెట్టారు! వారిని కులం పేరుతో దూషించారు.

దీంతో ఈ విషయాన్ని న్యాయవాది డాక్టర్‌ వసంత్‌ కుమార్‌ లిఖితపూర్వకంగా ఏజీ ఎస్‌. శ్రీరాం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో హైకోర్టు న్యాయవాది ఎం.సుజాత సైతం ఇదే విషయంపై అడ్వకేట్ జనరల్ కు లేఖ రాశారు. ఇందులో భాగంగా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను కూడా లేఖకు ఆమె జత చేశారు. ఈ లేఖలను పరిశీలించిన ఏజీ శ్రీరాం స్వయంగా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో న్యాయమూర్తులు, న్యాయాధికారిపై కామెంట్లు చేసిన వారిని కూడా ప్రతివాదులుగా చేర్చారు.